న్యాయస్థానం పనివేళలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పిల్లలు ఉదయం ఏడు గంటలకు పాఠశాలకు వెళ్లగలిగితే, న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను తొమ్మిది గంటలకు ఎందుకు ప్రారంభించలేరు అని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
సాధారణంగా వారాంతంలో ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టు బెంచ్ లు సమావేశం అవుతాయి. సాయంత్రం 4 గంటల వరకు కేసుల విచారణను కొనసాగిస్తాయి. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. కానీ నేడు సాధారణ సమయాలకు భిన్నంగా సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణను ప్రారంభించింది.
జస్టిస్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు దూళియా నేతృత్వంలోని ధర్మాసనం నేడు ఉదయం 9.30 గంటలకు కేసుల విచారణను చేపట్టింది. ఓ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా బెంచ్ నిర్ణయాన్ని మాజీ అటార్నీ జనరల్ ముఖుల్ రోహిత్గీ ప్రశంసించారు. కోర్టులను ప్రారంభించడానికి ఈ సమయం (9.30) సరైన సమయమని తాను భావిస్తున్నట్టు రోహిత్గి అన్నారు.
దీనిపై జస్టిస్ లలిత్ స్పందిస్తూ… ఆదర్శవంతంగా, తాము ఉదయం 9 గంటలకు విధుల్లో చేరాలన్నారు. తమ పిల్లలు ఉదయం 7 గంటలకు పాఠశాలకు వెళ్లగలుగుతున్నారని, తాము ఉదయం 9 గంటలకు న్యాయస్థానానికి ఎందుకు రాలేమని ఆయన అన్నారు.