తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. పొరుగు దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వకుంటే… కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందంటూ ఆ పార్టీ స్పష్టం చేసింది. కోల్‌కతాలో జరిగిన ఓ మీడియా సమావేశంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గీయ మాట్లాడుతూ… ‘‘పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్లందరికీ పౌరసత్వం ఇవ్వాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వహించడంలో విఫలమైనా.. సీఎం మమతా బెనర్జీ శరణార్థులను పౌరసత్వ హక్కులకు దూరం చేసినా, కేంద్ర ప్రభుత్వమే తన అధికారాలను ఉపయోగించి పౌరసత్వం ఇస్తుంది..’’ అని అన్నారు.