ఆర్మూర్ రైతు దీక్ష రాజకీయంగా ఒక మెట్టు ఎక్కేలా చేసిందన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. రైతులను ఆదుకునేందుకే మొదటిసారిగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. దాన్ని అమలు చేయించే బాధ్యత తనదని రాహుల్ హామీ ఇచ్చారన్నారు. కోరుట్లలో ఆయన రైతులతో ముఖాముఖి అయ్యారు.
రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ డిక్లరేషన్ ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి.. ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు చక్కెర ఫ్యాక్టరీని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నాటకాలాడి పంట బీమా అందించడంలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
పంట బీమా ఇవ్వని ప్రభుత్వం… రైతు చనిపోతే బీమా ఇస్తుందని ఫైర్ అయ్యారు. ఈ విధంగా ప్రభుత్వం రైతు చావును కోరుకోవడం దారుణమన్నారు. మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ కమిషన్లలా.. రైతుల కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సమస్యలను రైతు కమిషన్ ద్వారా పరిష్కరిస్తామని.. ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ కు కట్టబెట్టే కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ స్పష్టమైన విధానంతో ముందుకు వస్తోందని.. మోడీ, అమిత్ షా దేశాన్ని అమ్మేస్తుంటే..అదానీ, అంబానీ దేశాన్ని కొంటున్నారని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఇద్దరు గుజరాతి పెట్టుబడిదారులకు దేశాన్ని అమ్ముతున్నారని..గుజరాత్ మోడల్ అంటే ఇదేనా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో 3వేల వైన్ షాపులు.. 6వేల బెల్టు షాపులున్నాయని.. ఇదేనా కేసీఆర్ తెలంగాణ మోడల్..? అని ఆయన ఎద్దేవా చేశారు.