కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించిన పక్షంలో తాము ఈ కార్యక్రమానికి గైర్హాజరవుతామని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా .. ఈ భవనాన్ని ప్రారంభించాలని ఆయన అన్నారు. అయితే ఈ బిల్డింగ్ ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలన్న పిలుపును తాము అంగీకరించబోమని, ఈ భవనం ఎంతో అత్యవసరమన్నది నిజమే అయినప్పటికీ మోడీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. దీని ప్రారంభోత్సవ విషయంలో విపక్షాలు తనను కాంటాక్ట్ చేయలేదని, కానీ రాష్ట్రపతిని ఆహ్వానించాలన్నది రాజ్యాంగం ప్రకారం సరి కాదని అన్నారు. లోక్ సభకు స్పీకర్ ‘కస్టోడియన్’ అని, కొత్త భవనాన్ని ఆయన ప్రారంభించాలని ఒవైసీ పేర్కొన్నారు.
మోడీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని స్పీకర్ చేత ప్రారంభింపజేయాలన్నారు. ఓం బిర్లా ఇనాగురేట్ చేస్తే మేం ఈ కార్యక్రమానికి హాజరవుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్న 19 విపక్షాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోడీ పూర్తిగా పక్కన బెట్టేయడం మన ప్రజాస్వామ్యానికి అవమానకరమే కాక.. నేరుగా దాడి చేసినట్టేనని ఆరోపించాయి. ఈ నెల 28 న ప్రారంభోత్సవానికి నోచుకోనున్న కొత్త పార్లమెంట్ భవనానికి మోడీ 2020 డిసెంబరు 10 న శంకుస్థాపన చేశారు.
ఇందులో లోక్ సభ ఛాంబర్ లో 888 సీట్లు, రాజ్యసభ ఛాంబర్ లో 300 సీట్లు ఉన్నాయి. ఉభయ సభలను ఒకేసారి సమావేశపరచవలసి వస్తే లోక్ సభ ఛాంబర్ లో 1280 మంది సభ్యులు కూర్చునే సౌకర్యం ఉంది.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలన్న విపక్షాల నిర్ణయంపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ.. గత తొమ్మిదేళ్లలో అయిదు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు కొత్త అసెంబ్లీ భవనాలకు శంకు స్థాపనలో, ప్రారంభోత్సవాలో చేశాయని, అయినా ఒక్కసారి కూడా గవర్నర్ ని గానీ, రాష్ట్రపతిని గానీ ఆహ్వానించలేదని అన్నారు. ఈ రాష్ట్రాల సీఎంలు గానీ, పార్టీ అధ్యక్షులు గానీ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు.