శివసేన(ఉద్దవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ నూతన వైభవాన్ని సంతరించుకుందని ఆయన అన్నారు. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే రాబోయే సాధారణ ఎన్నికల నాటికి దేశ రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు.
సామ్నా పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు విద్వేష,విభజన విత్తనాలు నాటొద్దని ఆయన హితవు పలికారు. రామ మందిర నిర్మాణ అంశానికి సంబంధించిన పరిష్కారం లభించిందన్నారు.
ఇప్పుడు దాన్ని ఆసరాగా తీసుకుని ఎన్నికలకు వెళ్లే పరిస్థితులు లేవన్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ‘లవ్ జిహాద్’అంశాన్ని బీజేపీ ఇప్పుడు ముందుకు తీసుకు వచ్చిందన్నారు. దీన్ని ఆయుధంగా చేసుకుని ఓ వర్గంలో భయాందోళనలు సృష్టించి తద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు.
నటి తునీషా శర్మ, శ్రద్ధా వాకర్ హత్యలు లవ్ జిహాదీ నేపథ్యంలో జరిగినవి కాదన్నారు. ఏ వర్గానికి చెందిన మహిళలపై దాడి చేసినా దాన్ని ఖండించాల్సిందేనన్నారు. నూతన సంవత్సరంలోనైనా భయం గుప్పిట్లో నుంచి భారత్ బయటపడాలని ఆయన ఆకాంక్షించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. సంకుచిత ఆలోచనా ధోరణిని విడిచి పెట్టాలంటూ ప్రధాని మోడీ ఎప్పుడు చెబుతారని చెప్పారు. కానీ బీజేపీలోనే ఆ వైఖరి ఎక్కువగా ఉందన్నారు. విపక్షాల హక్కులను గుర్తించేందుకు కూడా పాలకులు సుముఖంగా లేరని ఆరోపించారు.