పోలీసులు రాష్ట్రమంతా నాకాబందీ పెట్టేశారు… పోలీసుల పద్మవ్యూహాం నుండి రేపిస్ట్ రాజు తప్పించుకోలేకపోయాడు. అందుకే పోలీసులు చంపేస్తారన్న భయంతో తనే ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభుత్వ అనుకూల ఛానెల్స్ ఊదరగొడుతున్నాయి. 8 రోజుల పాటు పట్టుకోకపోతే ప్రశ్నించని మీడియా ఇప్పుడు పోలీసులను ఆకాశానికెత్తేస్తుంది. కానీ తనది నిజంగా ఆత్మహత్యేనా…? పోలీసులే చంపి పడేసి కథలు చెప్తున్నారా…?
నిజంగానే రేపిస్ట్ రాజుది ఆత్మహత్య అయితే…సైదాబాద్ సింగరేణి కాలనీ నుండి ఉప్పల్ వచ్చే వరకు రేపిస్ట్ రాజు ట్రేస్ అయ్యాడు. కానీ అక్కడ నుండి ఎక్కడకు వెళ్లారనేది మొదట్లో క్లారిటీ లేదు. అయితే… రేపిస్ట్ రాజు నిజంగానే నడుచుకుంటునో, బస్సులోనో, రైళ్లోనో వెళ్తే సీసీటీవీ ఫుటేజ్ లో ఎక్కడో ఒక చోట ఉండేవాడు. కచ్చితంగా ట్రేస్ అయ్యేవాడు. కానీ ట్రేస్ కాలేదంటూ పోలీసులు కథనం చెప్పారు.
నష్కల్ వద్ద తమకు అనుమానాస్పదంగా కనపడ్డాడని, మమ్మల్ని చూసి పట్టుకుంటారన్న భయంతో రైలుకు ఎదురెళ్లాడని రైల్వే కీమెన్లు చెప్పారు. కానీ ఉప్పల్ నుండి నష్కల్ వరకు అంటే దాదాపు 120కి.మీ దూరం ఉంటుంది. ఈ మధ్యలో రాజు నడుచుకుంటూ వెళ్లినా, బస్సులో వెళ్లినా ఈజీగా ట్రేసవుట్ అయ్యేవాడు. కానీ దొరకలేదు… పైగా రైల్వేట్రాక్ పై చచ్చిపోయి ఉన్నాడు. అంటే చంపి పడేసినట్లేగా అని మృతుడి తరఫు వారి వాదన. రాజు సీసీ టీవీల్లో లేడంటే… హైదరాబాద్ లో మాయమై.. నష్కల్ లో ప్రత్యక్షమయ్యాడా…? పోలీసులే చెప్పాలి.
గతంలో దిశ సంఘటన అయినా, అంతకు ముందు వరంగల్ యాసిడ్ దాడి అయినా ఎన్ కౌంటర్ జరిగింది. కానీ దిశ సంఘటనలో విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. జ్యూడిషియల్ కమిటీ వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. అక్కడా పోలీసులే హీరోలు. కానీ ఇక్కడ తమ చేతికి మట్టి అంటకుండా పోలీసులే ఎదో చేశారని విమర్శలు వస్తున్నా… ఇక్కడ కూడా ఇప్పుడు పోలీసులే హీరోలవుతున్నారు.