కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. రాష్ట్రాలు అంగీకారం తెలిపితే ఆ నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్పారు.
రాష్ట్రాలతో ఒప్పందం కుదిరితేనే అది సాధ్యమవుతుందని ఆమె అన్నారు. 2023-24 బడ్జెట్ సమావేశానంతరం పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ…
దేశాభివృద్ధి కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. వన్ నేషన్- వన్ రేషన్ కార్డు పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు. బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చామని ఆమె వివరించారు.
కేంద్ర విద్యుత్ సహా పలు రంగాల్లో తీసుకు వస్తున్న పలు సంస్కరణలను రాష్ట్రాల్లో అమలు చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు వస్తామని ఆమె వెల్లడించారు. సిమెంట్ ధరలు తగ్గించే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 18న జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.