రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు వాహనాల్లో నిద్రపోతే ఇంక అంతే సంగతులు నిద్రలోనే అటు నుంచి అటే ప్రాణాలు పైకి పోతాయి. అందువల్ల వాహనాల్లో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. కన్ను మూస్తే చాలు, క్షణాల్లోనే ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇదే అంశాన్ని రైళ్లకు ఆపాదిస్తే ఎలా ఉంటుంది ? అంటే.. రైళ్లను నడిపించే లోకో పైలట్లు గనక నిద్రపోయారనుకోండి, అప్పుడు ఏమవుతుంది ? ఇంక అంతే సంగతులా ? రైలుకు ప్రమాదం జరుగుతుందా ? అంటే.
రైళ్లను నడిపించే సమయంలో ఇంజిన్‌లో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఇద్దరు ఉంటారు. అయితే ఇద్దరూ గనక నిద్రపోతే అప్పుడు ఎలాంటి నష్టం జరగదు. ఎందుకంటే రైళ్లలో విజిలెన్స్ డివైస్ ఉంటుంది. సాధారణంగా లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఇద్దరూ ఇంజిన్‌లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఏదో ఒక బటన్‌ను ప్రెస్ చేయడమో, ఇతర పనులు చేయడమో చేస్తుంటారు. అందువల్ల విజిలెన్స్ డివైస్ యాక్టివేట్ కాదు. అయితే ఏ పనిలేకుండా ఖాళీగా ఉంటే వారు విజిలెన్స్ డివైస్ యాక్టివేట్ అవకుండా ఉండేందుకు గాను ఒక నిమిషంలోగా అక్కడే ఉండే బీపీవీజీ అనే బటన్ స్విచ్‌ను ప్రెస్ చేయాలి. అయితే దాన్ని కూడా ప్రెస్ చేయకుండా వారు నిద్రపోయి ఉంటే ఆ తరువాత 8 సెకన్లకు ఒక లైట్ వెలుగుతుంది.
లైట్ వెలిగాక బజర్ సౌండ్ వస్తుంది. అయినప్పటికీ మళ్లీ 8 సెకన్లలో ఇద్దరూ స్పందించకపోతే అప్పుడు ఇంజిన్ దానంతట అదే బ్రేకులు అప్లై చేసుకుని ఆగిపోతుంది. ఆ తరువాత లోకోపైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ మేల్కొంటే అందులో ఉండే విజిలెన్స్ డివైస్ రిసెట్ బటన్‌ను 3 నిమిషాలు ఆగి ప్రెస్ చేయాలి. దీంతో ఈ విషయం ఇంజిన్‌లో రికార్డవుతుంది. తరువాత ఇంజిన్‌ను స్టార్ట్ చేసి మళ్లీ ప్రయాణించవచ్చు. అయితే ఈ విధంగా జరిగినట్లు ఇంజిన్‌లో రికార్డు అవుతుంది కనుక ఆ సమయంలో విధుల్లో ఉన్న లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్‌లు అందుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అలా చేస్తే వారు విధుల నుంచి సస్పెండ్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే సహజంగానే లోకో పైలట్లు చాలా శిక్షణ తీసుకుని ఉంటారు. అందువల్ల ఇలాంటి సంఘటనలు దాదాపుగా అస్సలు జరగవనే చెప్పవచ్చు.
ఇక ఈఎంయూ లాంటి ఇంజిన్‌లలో పైన తెలిపిన విజిలెన్స్ డివైస్‌లాగే డెడ్ మ్యాన్ సిస్టమ్ ఉంటుంది. అందులో ఇచ్చే బటన్‌ను మోటార్‌మ్యాన్ ప్రెస్ చేయాలి. లేకపోతే బ్రేకులు ఆటోమేటిక్‌గా అప్లై చేయబడి ఈఎంయూ ఇంజిన్ కలిగిన ట్రైన్ ఆగుతుంది. కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండానే లోకో పైలట్లు విధులు నిర్వర్తిస్తారు.