ఒంటిపై ఖాకీ బట్టలు వేసుకొని సమాజ సేవ చేయాలనే ఆశయ సాధనలో ఓటమి పాలయ్యారు. ఆ తీవ్ర మనస్తాపం కానిస్టేబుల్ పరీక్షల్లో కొన్ని మార్కులతో ఫైల్ అయిన అభ్యర్థులను వెంటాడింది. ఆత్మహత్యలకు పురిగొల్పి..కన్న వారికి కడుపుకోతను మిగిల్చింది.
అయితే కనీసం ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న కానిస్టేబుల్ అభ్యర్థుల కుటుంబాలను ఓదార్చేందుకు కూడా ముందుకు రాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేతికొచ్చిన బిడ్డలు ఒంటి పై ఖాకీ డ్రెస్ వేసుకొని ఇంటికి వస్తారని ఎదురు చూసిన తల్లిదండ్రులు..కొడుకులు ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే అలాంటి కుటుంబాలకు బాసటగా మేము ఉన్నామని డిస్ క్వాలిఫై అయిన కానిస్టేబుల్ అభ్యర్థులంటున్నారు.
ఆత్మహత్య చేసుకున్న అదే విధంగా రన్నింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ అభ్యర్థి కుటుంబాలకు చందాలు వేసుకొని 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి దగ్గరున్న వంగపల్లిలో చనిపోయిన సతీశ్ అనే కానిస్టేబుల్ అభ్యర్థి కుటుంబానికి 25 వేల ఆర్థిక సహాయాన్ని యాసం ప్రదీప్ బ్యాచ్ చేసింది. అదే విధంగా వరంగల్ జిల్లాలోని సింగారం గ్రామానికి చెందిన జుక్కల రాజ్ కుమార్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మూడు మార్కులు తక్కువ వచ్చాయనే మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అతని కుటుంబానికి కూడా 25 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని యాసం ప్రదీప్ చెప్పారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం కాస్త కళ్లు తెరిచి చనిపోయిన కానిస్టేబుల్ అభ్యర్థుల కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా డిస్ క్వాలిఫై అయిన వాళ్లు ధైర్యం కోల్పోవద్దని చెబుతున్నారు.