అడప సురేందర్
తెలంగాణ యువసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
తెలంగాణ సాధనలో వేలాది మంది యువత అసువులుబాసిన విషాదాన్ని ఇంకా మరువనే లేదు. అప్పుడే మళ్లీ ఈ రాష్ట్రం ఆత్మబలిదానాలకు నిలయంగా మారడం ఆవేదనను కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదన్న బెంగతో వరుసగా యువకులు బలవన్మరణానికి పాల్పడటం యావత్ తెలంగాణ సమాజాన్ని కలచివేస్తోంది. ఉద్యమ సమయంలో అయినా ఆవేశంతో ప్రాణాలు తీసుకున్నవారు ఉన్నారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఏళ్లకేళ్లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసి.. చివరికి వయసు కూడా అయిపోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగంతోనే తిరిగి వస్తా ఇంట్లో చెప్పి పట్టణాలకు వెళ్లిన వారంతా.. ఇక తాము ఏ ఉద్యోగానికి పనికిరామన్న వేదనతో తనువు చాలిస్తున్నారు.
తాజా బలవన్మరణాలు.. ఆత్మహత్యలు కానేకావు. ముమ్మాటికి ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలే. ఉద్యోగాల పేరుతో ఆశచూపి.. వారిని మరో పని చేసుకోనివ్వకుండా.. ఏపని రాకుండా నిస్సహాయులని చేస్తోంది ఈ సర్కార్. నడి వయసు రావడంతో.. ఎలా బతకాలో తెలియక చివరికి జీవితానికే ముగింపు పలుకుతున్నారు వారంతా. ఈ పాపం ప్రభుత్వానికి కాకపోతే మరెవరిది? ఎన్నికలు వస్తే చాలు…త్వరలోనే తీపికబురు అంటూ… చావుకబురు వినేలా చేస్తోంది.
ప్రజలకు సేవ చేసే ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి చనిపోతే లేదా స్థానం ఖాళీ అయితే..ఆరు నెలల్లోగా దాన్ని భర్తీ చేయాలనే చట్టం ఉంది. మరి అదే ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ ఉద్యోగాలకు ఆ నిబంధన ఎందుకు వర్తించదు? ఒక ఉద్యోగి రిటైర్ అయినా లేదా చనిపోయినా ఆరు నెలల్లో దాన్ని భర్తీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ఎందుకు మొదలుపెట్టదు? కనీసం ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్‌ను రూపొందించలేని దీనావస్థలో ప్రభుత్వం ఉందటే.. యువత, నిరుద్యోగుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోచ్చు. మరోవైపు నిరుద్యోగ భృతి పేరుతోనూ వారిని ఆశల పల్లకి ఎక్కిస్తోంది. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్కరికీ రూపాయి ఇచ్చింది లేదు.
ఇక యువకులు చనిపోయాక.. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించి గొప్పపని చేసినట్టుగా జబ్బలు చరుచుకుంటోంది ప్రభుత్వం. ఆ ఉద్యోగమేదో ముందే ఇస్తే వారి జీవితం నిలబడేది కదా? ఇప్పటికైనా ప్రభుత్వ కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది. లక్షల కొద్ది ఉద్యోగాలు ఇచ్చామని కథలు చెప్పడం మాని.. తెలంగాణ భవిష్యత్ ఆశాజ్యోతులు ఆరిపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.