మందమర్రి టోల్ ప్లాజా సిబ్బంది పై బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన దాడి ఘటనపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంత ఓపెన్ గా గన్ మెన్ల పహారిలోనే గుండాగిరి జరుగుతూ ఉంటే ఎట్ల చూస్తూ ఊరుకోవాలి..? అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు జరకూడడు అంటే కేసీఆర్ హఠావో..తెలంగాణ బచావో అని ట్వీట్ లో పేర్కొన్నారు.
అయితే మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ ప్లాజా సిబ్బంది పై బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య దాడికి దిగారు. టోల్ ప్లాజా సిబ్బంది ప్రోటోకాల్ పాటించకుండా దురుసుగా వ్యవహరించడమే ఈ దాడికి కారణంగా ఆయన సమర్థించుకుంటున్నారు. గత నెలలోనే మంద్రమర్రి టోల్ ప్లాజా ప్రారంభమైంది. అప్పటి నుంచి టోల్ ప్లాజా వద్ద వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేస్తున్నారు.
ఇక ఎమ్మెల్యే వాహనం అక్కడకు చేరుకోగానే టోల్ ప్లాజా సిబ్బంది ప్రోటోకాల్ పాటించలేదు. ఆయన కారుకు రూట్ క్లియర్ చేయలేదు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కారు దిగి.. రహదారి పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రజల నుంచి టోల్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ సిబ్బంది పై దాడికి దిగారు.ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. టోల్ ప్లాజా సిబ్బందే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని స్పష్టం చేశారు. ఇక గతంలోనూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పోస్టులు పెడితే సీరియస్ గా ఉంటుందని హెచ్చరించిన ఆయన.. ఇంకోసారి పోస్టు పెడితే నీ సంగతి చెబుతానంటూ సీరియస్ గా హెచ్చరించారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన స్వామి అనే వ్యక్తికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు.. ఇప్పుడా ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.