బీఆర్ఎస్ ఖమ్మం సభకు సంబంధించి కేసీఆర్ పై స్థానిక ప్రతిపక్షాలు కౌంటర్ల వర్షం కురిపిస్తుంటే..బీజేపీయేతర జాతీయ పార్టీలు కొన్ని విభిన్నంగా రియాక్ట్ అవుతున్నాయి. కాంగ్రెస్ లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమి వర్కౌంట్ కాదని..నిన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడిస్తే..తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారీక్ అన్వర్ కూడా ఇదే కోణం మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అయినా లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని అన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం 5లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. వాటిని పూర్తి చేయడంలో విఫలం అయ్యారన్నారు. దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, విపక్షాలను కాంగ్రెస్ ఏకం చేసి పోరాడుతుందని, కాంగ్రెస్ లేని కూటమి వల్ల ఉపయోగం ఉండదని తారీక్ అన్వర్ వ్యాఖ్యానించారు.
కేంద్రం తెచ్చిన బిల్లులకు కేసీఆర్ పార్టీ మద్దతు ఇచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ లక్ష్యం కాంగ్రెస్ ను బలహీన పరచడమేనని, కాంగ్రెస్ కు నష్టం చేయడానికి కేసీఆర్ నిరంతరం పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని, భిన్న అభిప్రాయాలున్నా పార్టీ కోసం నేతలంతా ఐక్యంగా పనిచేస్తారని స్పష్టం చేశారు. ఎంఐఎం బీజేపీకి బీ టీమ్ గా పనిచేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి మేలు చేయడమే కేజ్రీవాల్, అసదుద్దీన్ పని అని తారీక్ అన్వర్ వ్యాఖ్యానించారు.