అసెంబ్లీలో ధాన్యం కొనుగోలు వ్యవహారం పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనడానికి కూడా కేంద్రం చిన్నచూపు చూసి అనేక ఇబ్బందులు పెట్టిందని గుర్తుచేశారు.
ఇటీవల బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్ కు అన్ని విషయాలు తెలుసని అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్తే అన్నీ మర్చిపోతారా..అని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా సందు దొరికితే చాలు మా రాజేందరన్న మ్మమల్ని బద్నాం చేయాలనే చూస్తున్నాడు.. అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వడ్లు కొనాలని అడిగితే..నూకలు తినమంటారా.. అని అడిగారన్నారు. కేంద్రానికి ఇంత అహంకారమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లాంటి ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. బీజేపీ హయాంలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి పతనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 తర్వాత దేశంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు.
అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 7 రోజులు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 56 గంటల 25 నిమిషాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఇక అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పదే పదే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు ప్రస్తావించడం పై ఆయన స్పందించారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడారని చెప్పారు. కాగా అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కేసీఆర్ అలా మాట్లాడారని చెప్పారు.
అయితే, అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కేసీఆర్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఈటల నియోజక వర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించడం, డైట్ చార్జీల అంశంలో వెంటనే జీవో విడుదల చేయాలని సంబంధిత మంత్రికి, అధికారులకు సూచించడం విశేషం.