నువ్వెంత..నీ బతుకెంత..నేనొక ప్రపంచస్థాయి నాయకుడిని.. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబు మోహన్ అదే పార్టీ లోని ఓ కార్యకర్తకు సీరియస్ వార్నింగ్ ఇస్తూ.. బూతులు తిట్టారు. ఇప్పడు ఈ బూతు పురాణం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
డీటైల్స్ లోకి వెళితే.. ఆందోల్ కి చెందిన బీజేపీ కార్యకర్త వెంకటరమణ బాబుమోహన్ కి కాల్ చేశారు. కాల్ కు రియాక్ట్ అయిన బాబు మోహన్ ముందు సాఫ్ట్ గానే.. ‘చెప్పు తమ్ముడు’.. అంటూ రియాక్ట్ అయ్యారు. కాసేపు ఇద్దరి మధ్య సంభాషణ సజావుగానే సాగింది. కానీ మీతో కలిసి పని చేయడం కోసం ఫోన్ చేశానని ఆ కార్యకర్త చెప్పాగానే.. బాబు మోహన్ ఆ కార్యకర్త పై బూతు పురాణం అందుకున్నారు.
‘నువ్వెంత..నీ బతుకెంత’.. అంటూ ధ్వజమెత్తిన ఆయన.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసేందుకు అమిత్ షా తనను బీజేపీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. తాను ఒక ప్రపంచస్థాయి నాయకుడినని ఆ కార్యకర్తపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన బండి సంజయ్ ని కూడా వదల్లేదు. ఆ కార్యకర్త బండి సంజయ్ పేరు ప్రస్తావించగా.. ‘బండి సంజయ్ ఎవడ్రా.. వాడు నా తమ్ముడు’ అని బదులిచ్చారు బాబు మోహన్.
అంతటి ఆగని బాబు మోహన్ ఇంకోసారి తనకు ఫోన్ చేస్తే.. ‘జోగి పేటలో చెప్పు తీసుకొని కొడతానని’ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే రేపే బీజేపీకి తాను రాజీనామా చేస్తానన్నారు. ఇక బాబు మోహన్ ఈ మాటలకు బదులుగా ఆ కార్యకర్త మాత్రం.. ‘ఓ కార్యకర్తకు ఇచ్చే మర్యాద ఇదేనా.. తాను ఎంతో కాలం నుంచి బీజేపీలో ఉన్నానని, కార్యకర్తగా కష్టపడుతున్నానని’ చెప్తున్నా.. బాబుమోహన్ వినిపించుకోకుండా ఫోన్ పెట్టేయ్ అంటూ అరిచారు.
తాను ఎన్నో పనులు చేశానని, తాను పుట్టినప్పుడు నీ వయసెంత.. అంటూ నిలదీశారు. జోగిపేటకు నువ్వేం చేయగలవు..నీకు ఎన్ని ఓట్లని ప్రశ్నించారు. తనకు 2 వేల ఓట్లు వచ్చాయని బదులివ్వగా..’ నీ స్థాయి ఎంత అంటూ మండిపడ్డారు. నువ్వు నాతో మాట్లాడడానికి అనర్హుడివి..’ అని కార్యకర్తను చిన్న చేసి మాట్లాడారు. ప్రస్తుత ఈ ఆడియో రికార్డింగ్ వైరల్ అవుతోంది.