నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి 12 గంటలకు ఓ కారు జన్వాడలోని హెచ్ పీ పెట్రోల్ బంకు వద్దకు చేరుకుంది. పెట్రోల్ లేదని కార్మికులు చెప్పారు. అయితే చాలా దూరం వెళ్లాలని..కారులో పెట్రోల్ లేదని యువకులు చెప్పడంతో పోనీలే.. అని కార్మికులు పెట్రోల్ పోశారు.
అయితే డబ్బులు చెల్లించే సమయంలో వారిచ్చిన కార్డు పని చేయలేదు. దీంతో క్యాష్ ఇవ్వమని వర్కర్స్ అడిగారు. అదే వారి పట్ల శాపమైంది. తమకే ఎదురు తిరుగుతారా.. మమ్మల్నే డబ్బులు అడుగుతారా.. అని యువకులు రెచ్చిపోయారు.క్యాషియర్ ను కొడుతుండగా.. అడ్డుకోవడానికి మధ్యలో కార్మికుడు సంజయ్ వెళ్లాడు.
అంతే సంజయ్ పై కూడా పిడి గుద్దులు కురిపించారు. దీంతో స్పాట్ లోనే సంజయ్ కుప్పకూలాడు. వెంటనే అక్కడి నుంచి సదరు యువకులు పరారయ్యారు. సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. హుటాహుటిన సంజయ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు.
దీంతో సంజయ్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. నార్సింగి పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్,అనూప్ లుగా గుర్తించారు.వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.