బీజేపీపై ఆర్జేడీ అగ్రనేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్ని అవినీతి మరకలు అంటిన వ్యక్తి అయినప్పటికీ బీజేపీకి మద్దతు ఇస్తే అతను పునీతుడై పోతాడని ఆయన అన్నారు. అలాంటి నేతలను బీజేపీ వాషింగ్ మెషిన్‌లో వేసి శుభ్రం చేస్తుందంటూ ఎద్దేవా చేశారు.
దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, వాతావరణం చాలా దారుణంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అధికార బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాని వారిని కళంకితులు, అవినీతిపరులంటూ ముద్ర వేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. వారిపై ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
తప్పుడు ఆరోపణలు మోపుతూ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా దాడులు చేయించి ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వాన్ని బీజేపీ హత్య చేయిస్తోందన్నారు. అప్పటికీ లొంగకపోతే తప్పుడు కేసులతో జైళ్లకు పంపిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పాట్నాలో నిర్వహించిన సీపీఐ-ఎం 11వ జనరల్ కన్వెన్షన్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. అందరం కలిసి భారత రాజ్యాంగానికి కాపాడుకోవడానికి పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడే ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.