అదానీ అంశంపై గురువారం రాజ్యసభలో విపక్షాలు మళ్ళీ రభసకు దిగాయి. దీనిపై జేపీసీ చేత విచారణ జరిపించాలని విపక్షనేతలు నినాదాలు చేశారు. . అయితే ప్రధాని మోడీ దీన్ని పట్టించుకోకుండా .. . రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చకు సమాధానమిస్తూ.. మీరు ఎంత ఎక్కువ ‘బురద’ జల్లితే కమలం అంత గొప్పగా వికసిస్తుందన్నారు. మీ దగ్గర బురద ఉందని, కానీ తన వద్ద గులాల్ ఉందని, ఎవరి దగ్గర ఏది ఉంటే దాన్నే విసురుతారని ఆయన చెప్పారు. ‘కీచడ్ ఉస్ కే పాస్ థా.. మేరే పాస్ గులాల్..జో భీ జిస్ కే పాస్ థా.. ఉస్ నే దియా ఉచాల్’ అని చమత్కరించారు.
కమలాన్ని వికసింపజేయడంలో మీరు చాలా కృషి చేస్తున్నారని, ఇందుకు మీకు కృతజ్ఞుడనై ఉంటానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. . కాంగ్రెస్ పార్టీని ఆయన దుయ్యబడుతూ రాజ్యాంగంలోని 356 అధికరణాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా నాడు కేంద్రం లోని ఆ పార్టీ ప్రభుత్వం 90 రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిందని, అలాగే ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడానికి ఇందిరాగాంధీ ఈ అధికరణాన్ని 50 సార్లు వినియోగించుకున్నారని ఆరోపించారు.
విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, తననెదుర్కొనేందుకు వాటికి దమ్ము లేదని ఆయన పేర్కొన్నారు. దేశ శాశ్వత సమస్యలను కాంగ్రెస్ ఎన్నడూ .పరిష్కరించలేకపోయిందన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి గట్టి పునాది వేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చెబుతున్నారని, కానీ 2014 లో తాను సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ పార్టీ కేవలం ‘దారి’ పై ‘గుంతలు’ మాత్రమే వేసిందని మోడీ విమర్శించారు.
నెహ్రు ఇంటిపేరును మీరెందుకు వినియోగించుకోరని కూడా ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇందుకు మీకు భయమా లేక సిగ్గు పడుతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలిందన్నారు. అయితే తన ప్రభుత్వ హయాంలో దేశ ఎకానమీ వేగంగా పుంజుకుందని, అవినీతిని తాము అదుపు చేస్తున్నామని మోడీ చెప్పారు.