నగరజీవులకు ట్రాఫిక్ కష్టాలు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవన్నది ‘నగర జగమెరిగిన’ సత్యం. బైక్ ప్రయాణమంటే కాస్తలో కాస్త మెరుగు. అదే కారైతే ట్రాఫిక్ లోనే సగం జీవితం గడిచిపోతుంది.
అసలు ఈ సిగ్నల్స్, ట్రాఫిక్ జామ్ లు, డివైడర్లు లాంటి సహన పరీక్ష సంవిధానాన్ని దాటి ఏదైనా గాల్లో ఎగిరి కారుంటే బావుండును! అదీ అందనంత ఎత్తులో వెళ్ళేలా అందుబాటు ధరల్లో దొరికేలా అనిపిస్తూ ఉంటుంది కదా..!
అదిగో అందుకే…అలాంటి ఓ గొప్పప్రయత్నం జరిగింది. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ కంపెనీ వాహన‘దారులకు’ శుభవార్త అందించింది. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీని రూపొందించారు. పూర్తి పర్యావరణ హితమైన ఈ వాహన ప్రోటోటైప్ ని ఈ200 పేరిట బెంగళూరులోని ఏరో ఇండియా ఈవెంట్‌లో ప్రదర్శించారు.
ఐఐటీ మద్రాస్ స్టార్టప్ కంపెనీ ద ఈ-ప్లేన్ వారు ఈ ప్రయోగంలో నిమగ్నమయ్యారు. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీని రూపొందించారు. రోడ్డుపై నడిచే ట్యాక్సీలకన్నా పది రెట్ల వేగంతో..పది నిమిషాల్లో పదికిలోమీటర్ల దూరాన్ని చేరుకొనే విధంగా దానిని ఆవిష్కరించారు.
పూర్తి పర్యావరణ హితమైన ఈ వాహన ప్రోటోటైప్ ని ఈ200 పేరిట బెంగళూరులోని ఏరో ఇండియా ఈవెంట్‌లో ప్రదర్శించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…
బ్యాటరీతో నడిచే ఈ ట్యాక్సీని పైలెట్ తో పాటు ఇద్దరు ప్రయాణించేందుకు వీలుగా దీనిని డిజైన్ చేశారు. భవిష్యత్తులో నలుగురు ప్రయాణికులు కూర్చునేలా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
ఫ్లయింగ్ ట్యాక్సీకి రన్ వేలు అవసరం లేదు, నిట్టనిలువుగా ఎగురుతుందని, అదే నిట్ట నిలువుగానే ల్యాండ్ అవుతుంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీనిలో ప్రొపెల్లర్ లో నాలుగు డక్ట్ ఫ్యాన్‌లను అమర్చింది.
ఈ టాక్సీ గాలిలో 1500 అడుగుల (457 మీటర్లు) వరకు ఎగురుతుంది. దీనిలో సంస్థ ఇన్‌స్టాల్ చేసిన నాన్-స్వాప్ చేయదగిన బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 10 నుంచి 20 ట్రిప్పుల వరకు ప్రయాణిస్తుందని చెప్పారు.
సాధారణ ట్యాక్సీల కన్నా చార్జీలు రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని స్టార్టప్ సీటీవో ప్రొఫెసర్ సత్యా చక్రవర్తి, ఈ-ప్లేన్ కంపెనీ సీఈఓ ప్రాంజల్ మెహతా తెలిపారు. అయితే, ఇవి ఎక్కువగా అందుబాటులోకి వస్తే.. సాధారణ ట్యాక్సీల్లాగానే చార్జీలు ఉంటాయని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి చార్జీలు కొంచెం ఎక్కువైనా ట్రాఫిక్ ఇబ్బందులను ఇది తప్పిస్తుందన్నారు. 10 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుతుందన్నారు. ఇది ఏ నగరంలోనైనా రూఫ్ టాప్ టు రూఫ్ టాప్ ఎయిర్ మొబిలిటికీ అనువైందిగా వివరించారు.