కడుపున పుట్టిన సంతానం ఆదరించకపోవడమో.. ఇంకేదైనా కారణమో.. తెలియదు కానీ.. ప్రస్తుత తరుణంలో వృద్ధులు అనాథలవుతున్నారు. ఒకప్పుడు ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ఘనంగా బతికిన వారు కూడా నేడు రహదారులపై యాచకులుగా దర్శనమిస్తున్నారు. దిక్కు తోచని స్థితిలో ఆదరించే వారు లేక యాచకులుగా మారి దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారిని కొందరు మనస్సున్న మహానుభావులు చేరదీస్తున్నారు.
ఇటీవలే రహదారులపై యాచకుడిగా కనిపించిన ఓ మాజీ పోలీస్ ఆఫీసర్‌ను తన తోటి బ్యాచ్ పోలీసులే గుర్తు పట్టి ఆదరించారు. అతనికి ఆశ్రయం కల్పించారు. ఇక ఈ ఘటన మరువక ముందే ఇలాంటిదే మరొక ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రహదారులపై 90 ఏళ్ల వృద్ధుడు యాచకుడిగా దుర్భరమైన స్థితిలో జీవిస్తున్నాడు. అయితే ఆశ్రమ్ స్వర్గ్ సదన్ (ఏఎస్ఎస్) సంస్థకు చెందిన వికాస్ గోస్వాని ఆ వృద్ధుడితో మాట్లాడగా.. అతను ఒకప్పటి ఐఐటీ విద్యార్థి అని, అతని పేరు సురేంద్ర వశిష్ట్ అని వెల్లడైంది.
సురేంద్ర 1969లో ఐఐటీ కాన్‌పూర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందాడు. తరువాత 1972లో లక్నోలో ఎల్ఎల్ఎం చేశాడు. అతని తండ్రి జేసీ మిల్స్‌లో సప్లయర్‌గా 1990లో కంపెనీ మూత పడే వరకు పనిచేశాడు. అయితే అతను రహదారులపై యాచకుడిగా ఎందుకు మారాడన్నది తెలియలేదు. కానీ అతన్ని ఏఎస్ఎస్ చేరదీసింది. అతనికి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. అతని కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా.. అలాంటి వారికి ఇలాంటి దుస్థితి పట్టడం నిజంగా దురదృష్టకరమే.