రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పలువుర్ని నామినేట్ చేసింది కేంద్రం. వారిలో ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఉన్నారు. అలాగే. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, పీటీ ఉషను రాజ్యసభకు ఎంపిక చేసింది కేంద్రం. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఇక ఈ ముగ్గుర్ని అభినందిస్తూ ప్రధాని మోడీ వరుస ట్వీట్లు చేశారు. పీటీ ఉష ప్రతి భారతీయునికి స్ఫూర్తి అని చెప్పారు. క్రీడలలో ఆమె సాధించిన విజయాలు మరువలేనివన్నారు. గత కొన్నాళ్లు యువతను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారని.. ఆమె చేసిన కృషి ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరని తెలిపారు. ఉష రాజ్యసభకు నామినేట్ అయినందుకు అభినందనలు తెలియజేశారు.
క్రియేటివ్ జీనియస్ ఇళయరాజా తరతరాలుగా ప్రజలను తన మ్యూజిక్ తో ఆకట్టుకుంటున్నారని తెలిపారు మోడీ. ఆయన బాణీలు అనేక భావోద్వేగాలను అందంగా ప్రతిబింబిస్తాయని చెప్పారు. ఇళయరాజా జీవిత ప్రయాణం కూడా స్ఫూర్తిదాయకమని.. ఆయన నిరాడంబరమైన జీవితం అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు మోడీ.
ఇక.. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ దశాబ్దాలుగా సృజనాత్మక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నారని చెప్పారు. ఆయన రచనల్లో భారతదేశ అద్భుతమైన సంస్కృతి కనిపిస్తుందని వివరించారు. విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయినందుకు అభినందనలు తెలియజేశారు ప్రధాని.