మాస్ట్రో ఇళయరాజా లైవ్ షోకి హైదరాబాద్ మరోసారి వేదికైంది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన లైవ్ షో సంగీత ప్రియులని, అభిమానులని ఉర్రూతలూగించింది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో షో ప్రారంభమై ఇళయరాజా పాడిన జననీ జననీ పాటతో మొదలైన మ్యూజికల్ ట్రీట్ ఆద్యంతం ఆకట్టుకుంది.
ఎన్నో రాత్రులోస్తాయిగానీ, మాటే మంత్రము, కలయా నిజమా పాటలని ఇళయరాజా స్వయంగా ఆలపించి అలరించారు. ఈ లైవ్ షో లో దాదాపు 35 పాటలు ఆలపించగా రీటేకులు, అపశ్రుతులు దొర్లకుండా లైవ్ షో ని కండక్ట్ చేయడంలో ఇళయరాజా మరోసారి తన మార్క్ చూపించారు.
మనో, ఎస్పీ చరణ్.. బాలు లేని లోటుని తీర్చడానికి తమ శక్తి మేరకు ప్రయత్నించగా కార్తిక్, శరత్ లు ఆకట్టుకున్నారు. చివర్లో సింగారాల పైరుల్లోన పాట స్టేడియంని సందడిగా చేసింది. ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఏళ్ళు గడుస్తున్నా అందులో ఉన్న ఫ్రెష్ నెస్ కొంచెం కూడా తగ్గదు. ఎన్ని సార్లు విన్నా అదే ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. అందుకేనేమో ఆయన్ని మ్యూజికల్ గాడ్ అంటారు.
80 ఏళ్ల వయసులో మూడున్నర గంటల పాటలు ఒక్క సెకన్ కూడా కూర్చోకుండా ఆయన లైవ్ కండక్ట్ చేయడం అందరినీ సర్ప్రైజ్ చేసింది. టాలీవుడ్ నుంచి దేవీశ్రీప్రసాద్, నాని, హరీష్ శంకర్, బుచ్చిబాబు, మంచు లక్ష్మి, ఇషా రెబ్బా, వర్ష బొల్లమ్మ.. ఇలా చాలా మంది ప్రముఖులు హజరయ్యారు.
ఈ లైవ్ షోలో ఎక్కువగా యువత కనిపించింది. స్టేడియంలోని అన్ని సెక్షన్లు నిండిపోయాయి. షో పూర్తయ్యే వరకూ ఫుల్ క్రౌడ్ ఉంది.