చెన్నయ్: తమిళనాట క్రేజీ హీరో విజయ్ డీఎంకేలో చేరుతున్నాడా…? డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఒక వివాహ వేడుకలో విజయ్ కరచాలనం అందిస్తున్న ఫోటో దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఆధారంగా విజయ్ డీఎంకేలో చేరుతున్నారన్న ప్రచారం మొదలవ్వడంతో తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ వార్త అన్నాడీఎంకే వర్గాలలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంతకీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే.. హీరో విజయ్ చెన్నయ్‌లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఓ వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ వివాహం కరుణానిధి ముని మనవరాలు ఓవియాది కావడంతో వచ్చిన అతిధుల్ని డీఎంకే నేత స్టాలిన్ స్వయంగా ఆహ్వానించారు. విజయ్‌ను సాదరంగా ఆహ్వానించిన స్టాలిన్ అతనితో కాసేపు మాట్లాడారు. వీరిద్దరి మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చాయో తెలియదు కానీ.. తమిళ పత్రికల్లో ఈ వార్త పతాక శీర్షికలకు ఎక్కింది. విజయ్ డీఎంకేలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
శాసనసభ ఎన్నికల్లో స్టాలిన్ డీఎంకేకు ఊపుతెచ్చేందుకు స్టార్ ఇమేజ్ వున్న నటులతో క్యాంపేన్ చేయాలని యోచిస్తున్నారు. తమిళనాట యూత్‌లో విపరీతమైన పాపులారిటీ వున్న విజయ్ తమ పార్టీలో చేరితే అది తిరుగులేని విజయానికి నాంది అవుతుందని స్టాలిన్ కొంతకాలంగా ఆలోచిస్తున్నారని సమచారం. అందులో భాగంగా మంతనాలు కూడా జరిగాయని, దరిమిలా విజయ్ ఇలా వివాహ వేడుకకు హాజరయ్యారని అంటున్నారు. ఓపక్క రజనీకాంత్ కమల దళపతి కానున్నారని వార్తలు రావడంతో ఖంగుతిన్న స్టాలిన్ పార్టీ ఇప్పటికిప్పుడు మరో స్టార్ కోసం వెతకడం ఆరంభించింది. రజనీ ప్రభావాన్ని తట్టుకుని గట్టెక్కాలంటే విజయ్ ఒక్కడు చాలనే అభిప్రాయం తమిళనాట ఉంది. అందుకే విజయ్ మద్దతు కోసం స్టాలిన్ తాపత్రయపడుతున్నారని అంటున్నారు. ఐతే, విజయ్ ఆమధ్య జయలలిత మరణం తరువాత తమిళనాట ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రచారంలోకి వచ్చారు. స్వయంగా పార్టీ పెడుతున్నారని విజయ్ అభిమానుల్లో టాక్ వినిపించింది. ఇంకోపక్క జయలలిత తన వారసుడిగా అజిత్‌ను అనౌన్స్ చేశారని, దానికి ఆధారాలు కూడా వున్నాయని అతని అభిమానులు చెప్పుకున్నారు. ఇంకోవైపు సీనియర్ నటుడు కమల్‌హసన్ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి తిరిగేసి అలిసిపోయి తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు. ఇలా తమిళ రాజకీయాలు సినిమా రంగం చుట్టూ తిరుగుతుంటాయి. ఈ రెండు రంగాలకు వున్న సంబంధం ఇప్పటిది కానే కాదు.
ఇక విజయ్ విషయానికి వస్తే.. తను ఆ మధ్య చేసిన సినిమాల్లో అన్నాడీఎంకేని విమర్శించే సన్నివేశాలు అప్పట్లో పెను సంచలనాలు సృష్టించాయి. సర్కార్, మెర్సల్ సినిమాల్లో అన్నాడీఎంకే సర్కార్‌కు వ్యతిరేకంగా వున్న సీన్లపై ఆ పార్టీ మంత్రులు, కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. ఆ సందర్భంలో డీఎంకే నుంచి విజయ్‌కు గట్టి మద్దతే లభించింది. అలా అని విజయ్ డీఎంకేకి సానుభూతిపరుడిగా వున్నాడని చెప్పలేం. 2010లోనే విజయ్ తన సుర మూవీలో అప్పటి డీఎంకే ప్రభుత్వాన్ని తప్పుబడుతూ సన్నివేశాలు పెట్టారు. తర్వాత 2014లో రిలీజైన కత్తి సినిమాలో 2జీ స్కామ్‌పై డైలాగ్ పెట్టి ఆ పార్టీ లీడర్లను వణికించాడు. మరి ఎవరికీ అంతుచిక్కని విజయ్.. ఇప్పుడు నిజంగానే డీఎంకే పార్టీలో చేరతాడా? లేక సినిమాలు చేసుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటాడా.. వేచి చూసే ధోరణి మన హీరోల కంటే తమిళ హీరోల్లోనే కనిపిస్తోంది.