కర్ణాటకలో ‘పే సీఎం’ పోస్టర్లు సృష్టించిన కలకలం ఇంతాఅంతా కాదు. సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వ అవినీతిని హైలైట్ చేసేందుకు విపక్ష కాంగ్రెస్ ఈ వెరైటీ పోస్టర్లతో బెంగుళూరులో వింత పోకడకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందని, ఇది ’40 శాతం కమీషన్’ సర్కార్ అని పేర్కొంటూ బొమ్మై ఫొటోతో కూడిన ఈ పోస్టర్ ని నగర వ్యాప్తంగా అనేక చోట్ల అంటించారు.
పైగా.. 40 శాతం ‘తిండిపోతు’ గా మారిన ఈ ప్రభుత్వం 54 వేలమంది యువకుల కెరీర్ ని నాశనం చేసింది’ అని కూడా వీటిపై స్లొగన్స్ రాశారు. కానీ ఈ పోస్టర్లపై తన ఫోటోను వినియోగించుకున్నారంటూ నటుడు అఖిల్ అయ్యర్ ఫైరయ్యాడు.
నా అనుమతి లేకుండా, నాకు చెప్పకుండా వీటిపై నా ఫోటోను ఎలా వాడుతారని, తాను లీగల్ చర్య తీసుకుంటానని ఆయన హెచ్చరించాడు. కాంగ్రెస్ ప్రచారంతో తనకెలాంటి సంబంధం లేదని.. అక్రమంగా ఉన్న ఈ పోస్టర్లమీద నా ముఖం చూసి బాధ పడ్డానని ట్వీట్ చేశాడు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సిద్దరామయ్య లను ట్యాగ్ చేశాడు. ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా వారిని కోరాడు. ప్రభుత్వ అవినీతిపై ప్రజలు ఫిర్యాదులను దాఖలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇటీవల ’40 పర్ సెంట్ సర్కార’ పేరిట వెబ్ సైట్ లాంచ్ చేసింది. ఈ పోస్టర్ల వ్యవహారంపై సీఎం బొమ్మై.. దర్యాప్తునకు ఆదేశించారు. ఇలాంటి ఎత్తుగడల వల్ల కర్ణాటక ఇమేజ్ దెబ్బతింటుందని ఆయన అన్నారు. అయితే ఆ తరువాత ఈ పోస్టర్లను అధికారులు తొలగించారు.