సైబరాబాద్ పోలీసులను నిలదీసిన
న్యాయమూర్తి
హైదరాబాద్ : ఎటువంటి నేరం చేయని హీరో శివాజీని ఎందుకిలా వేధిస్తున్నారని హైదరాబాద్ పోలీసులను హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. శివాజీ విదేశీ ప్రయాణాన్ని అడ్డుకుంటూ సైబరాబాద్ పోలీసులు విడుదల చేసిన ఉత్తర్వులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరో శివాజీని ఒక కేసులో ఇరికించి ఎటువంటి నేరం రుజువు కాకుండా, ఇటువంటి ఉత్తర్వులు జారీచెయ్యడం ఏమిటని హైకోర్టు అడిగిన ప్రశ్నకు పోలీసులు, రామేశ్వర రావు, మెగా కృష్ణా రెడ్డి తరపు న్యాయవాదులు తెల్లముఖం వేశారు. శివాజీపై ఎల్ఓసీ ఉత్తర్వులను పూర్తిస్థాయిలో తొలగించమని కోర్టు ఆదేశించినా పట్టించుకోక పోవడం, అమెరికన్ కాన్సలేట్ అధికారులకు శివాజీ మీద ఎటువంటి ఆంక్షలు లేవని తెలియచేయకుండా తమ ఆదేశాలను పోలీసులు పెడచెవిన పెట్టడంపై హైకోర్టు మండిపడింది. రెండురోజుల్లోగా పోలీసులు హైకోర్టు ఆదేశాలను అమలుపరచక పోతే చర్యకు సిద్దపడాలని న్యాయమూర్తి హెచ్చరించారు. ఎటువంటి నేరం చెయ్యని శివాజీని ఎందుకిలా వేధిస్తున్నారని న్యాయమూర్తి పోలీసులను పలుమార్లు ప్రశ్నించడంతో కోర్టు హాలులోనే ఉన్న రామేశ్వర రావు, మెగా కృష్ణారెడ్డి అనుచరులు కాస్త ఇబ్బందికి గురయ్యారు.