తెలంగాణలో భూకబ్జాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో భూముల రేట్లు ఆకాశాన్ని అంటడంతో.. చుట్టు పక్కల ప్రభుత్వ భూములకు రెక్కలు వస్తున్నాయి. తవ్వే కొద్ది ఈ ఆక్రమణలు బయటపడుతున్నాయి. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో జరుగుతున్న ఆక్రమణలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో ఈ భూములు హాంఫట్ అవుతున్నాయని చెబుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు మౌనం వహించడంతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు దోపిడీలకు అంతు లేకుండా పోతుందని అంటున్నారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భూములను కాపాడాలని మొరపెట్టుకుంటున్నారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిదిలోని వాయుశక్తి నగర్ లో ఆక్రమణలు యదేచ్చగా జరిగాయని అంటున్నారు. ఈ ప్రాంతం గతంలో పంచాయతీగా ఉండేదని.. అప్పుడు ఉన్న భూములు చాలా వరకు ఆక్రమణలకు గురైయ్యాయని స్థానికులు తెలిపారు. పాండాల అనురాద యాదగిరి గౌడ్ సర్పంచిగా ఉన్న సమయంలో వాయిశక్తి నగర్ లో సర్వే నెంబర్ 541లో ప్రభుత్వానికి చెందిన 4 ఎకరాల 10 కుంటల స్థలం ఉండేది. ఇప్పుడు అందులో 20 కుంటలు మాత్రమే మిగిలింది. అనురాధ యాదగిరి గౌడ్ అప్పట్లో అనేక గృహ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న గృహ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? లేవా అర్థం కావటం లేదని స్థానికులు చెబుతున్నారు. 4 ఎకరాలకు పైగా ఉండే ప్రభుత్వ స్థలంలో ఇప్పుడు అర ఎకరా మాత్రమే మిగిలి ఉండటంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఈ ప్రాంతం పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినా.. ఇక్కడ అధికారులు ఈ సమస్యపై స్పందించడం లేదని అంటున్నారు.