మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో బీజేపీకి చెందిన మిశ్రీ చాంద్ గుప్తా అనే మాజీ నేత అక్రమ హోటల్ ని కూల్చివేశారు. లోగడ జగదీశ్ యాదవ్ అనే నేత హత్య కేసులో నిందితుడైన ఇతడి హోటల్ ని సుమారు 60 డైనమైట్లతో నిన్న కూల్చివేశారు.. డిసెంబరు 22 న తన వాహనంతో జగదీశ్ యాదవ్ ని ఢీ కొట్టి అతని మరణానికి కారకుడయ్యాడన్న ఆరోపణలు ఈయనపై ఉన్నాయి.
మర్డర్ కేసులో ఇరుక్కున్న ఇతడిని పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. ఇండోర్ కు చెందిన ప్రత్యేక పోలీసు బృందం.. సాగర్ సిటీకి వచ్చి ఇతని హోటల్ కూల్చివేతను పర్యవేక్షించింది. ఈ ఘటనలో కొన్ని క్షణాల్లోనే ఈ హోటల్ నేలమట్టమైంది. ఎవరూ గాయపడలేదని సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య తెలిపారు.
చాంద్ గుప్తా.. నిబంధనలను ఉల్లంఘించి ఈ హోటల్ నిర్మించాడని ఆయన చెప్పారు. జగదీశ్ యాదవ్ హత్య కేసులో గుప్తాతో బాటు ఇతని 8 మంది కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు కేసు పెట్టారు.
వీరిలో అయిదుగురిని అరెస్ట్ చేశారు,. గుప్తా ఇంకా పరారీలో ఉన్నాడు. కిరణ్ యాదవ్ అనే ఇండిపెండెంట్ కౌన్సిలర్ కి జగదీశ్ యాదవ్ సమీప బంధువని, అయితే స్థానిక ఎన్నికల్లో గుప్తా భార్యను 83 ఓట్ల తేడాతో కిరణ్ యాదవ్ ఓడించాడని, ఆ కక్షతో జగదీశ్ యాదవ్ ని చాంద్ గుప్తా హతమార్చాడని తెలుస్తోంది. ఈ హత్యను ఖండిస్తూ.. స్థానికులు లోగడ భారీ ఎత్తున నిరసనలకు దిగారు.