రాష్ట్రవ్యాప్తంగా మద్యం, గంజాయి, డబ్బులు, బంగారు, వెండి అక్రమ రవాణాపై ఎస్ఈబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతూ అక్రమార్కులను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున కర్నూలు శివారులోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించగా.. ఓ ప్రైవేటు బస్సులో రూ.1.25 కోట్ల రూపాయలను అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్ నుంచి రాజంపేటకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే, బస్సులో ప్రయాణికుడైనా రాజంపేటకి చెందిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తి బ్యాగు సోదా చేయగా కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. డబ్బుకు సంబంధించిన వివరాలు అడిగితే సమాధానం చెప్పలేదు. ఎలాంటి బిల్లులు లేకపోవడంతో అధికారులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదును రైల్వే కాంట్రాక్టర్‌కు ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్లు నిందితుడు తెలిపాడు.
స్వాధీనం చేసుకున్న మొత్తం డబ్బును స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు ఎస్ఈబీ అధికారులు. నెల రోజుల క్రితం కూడా ఎస్ఈబీ అధికారులు దాడుల జరిపి అక్రమంగా తరలిస్తున్న కోట్లాది రూపాయలు, బంగారం, వెండి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితులు కూడా పోలీసుల కళ్లుగప్పేందుకు సింపుల్‌గా బస్సుల్లో ప్రయాణిస్తూ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. అయితే, పోలీసులు ప్రతి వాహనాన్ని సోదా చేస్తూ అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు.