సంచలనాలకు కేరాఫ్ గా మారారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. తన మన అనే తేడా లేకుండా బుల్డోజర్ ట్రీట్ మెంట్ ఇచ్చేస్తున్నారు. ఎంతటి వారు తప్పు చేసినా వదిలిపెట్టడం లేదు. తాజాగా ఎమ్మెల్యేకు చెందిన పెట్రోల్ బంక్ ను నేలమట్టం చేయించారు.
మొన్నటి ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు షాజిల్ ఇస్లామ్ అన్సారీ. ఈయనకు బరేలీ-ఢిల్లీ జాతీయ రహదారిపైపర్సాఖేడా దగ్గర ఓ పెట్రోల్ బంక్ ఉంది. అయితే.. దీన్ని ఎమ్మెల్యే అక్రమంగా నిర్మించారని నోటీసులు జారీ చేసిన అధికారులు.. బుల్డోజర్ తో కూల్చేశారు.
ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ కూల్చివేతపై ఎస్పీ తీవ్రంగా స్పందించింది. తమపై కక్షగట్టి ఇలా చేస్తున్నారని విమర్శలు చేసింది. ఇటీవల శాసనసభలో తమ పార్టీ బలం పెరిగిందని అన్నారు షాజిల్. అలాగే యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇకపై ఏ దైనా చప్పుడు చేస్తే ఎస్పీ గన్స్ నుంచి పొగ రాదు.. తూటాలు దూసుకొస్తాయని హెచ్చరించారు.
ఎస్పీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. అయితే.. ఈ వివాదం నడుస్తుండగానే.. పెట్రోల్ బంక్ కూల్చివేయడం అగ్గికి ఆజ్యం పోసినట్లు అయింది. ఈ విషయంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. యూపీ ఎన్నికల సందర్భంగా నేరస్తుల పాలిట సింహస్వప్నంలా మారారు యోగి. ఎవరు నేరం చేసినా వారి ఇంటి ముందు బుల్డోజర్ దిగిపోతోంది. అక్రమార్కుల నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలోనే యోగిని బుల్డోజర్ బాబా అని పిలవడం స్టార్ట్ చేసింది ఎస్పీ.