– తొలివెలుగు ఎక్స్ క్లూజివ్
– సోసైటీలో భారీగా అక్రమాలు
– తేల్చిన అనిత కమిటీ
– 24 క్రాఫ్ట్స్ కాదు..అయినా సభ్యత్వం
– ఫేక్ ఐడీ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి
– అధిక నిధులతో కాంట్రాక్టర్స్ సంబరం
– ఫ్లాట్స్ – రో హౌజ్ అక్రమ కేటాయింపులు
– 99 కోట్ల అక్రమ సొమ్ము రికవరీ చేయాలి
చిత్రపురి.. అదో చిత్ర విచిత్రాలు కాలనీ. 24 క్రాఫ్ట్స్ కు చెందినవారికి స్థలాలు, సింగిల్, డబుల్, త్రిబుల్ బెడ్ రూం, రో హౌజ్, డూప్లెక్స్ ఇళ్లు ఇవ్వాలని ఖాజాగూడలో ప్రభుత్వం భూమి కేటాయించింది. అయితే ఇందులో భారీగా అక్రమాలు జరిగాయి. మహారాష్ట్రలోని ఓ బ్యాంకు వద్ద భూమిని తనాఖా పెట్టి డబ్బులు దండుకున్నవారు కొందరయితే.. సభ్యత్వం నుంచి కేటాయింపుల వరకు అక్రమాలకు పాల్పడి వందల కోట్లు వెనకేసుకున్నవారు మరికొందరు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేని జర్నలిస్టులు, రాజకీయ నాయకులతో పాటు.. సభ్యుల్లో పెద్దలుగా వ్యవహరించిన వారే.. వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు ఇచ్చేసుకున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ అనిత కమిటీ చిత్రపురి అక్రమాలపై నిగ్గు తేల్చింది. భారీగా అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చింది.
పాత కమిటీ మొత్తం, ఇప్పుడున్న కమిటీలో ఐదుగురు అవినీతికి బాధ్యులు అని తేల్చింది అనిత కమిటీ. 16 మంది కమిటీ సభ్యుల నుండి రూ.99 కోట్లను రికవరీ చేయాలని రిపోర్ట్ ఇచ్చింది. 4,213 ఫ్లాట్స్ కి 9,153 మెంబర్ షిప్ లు ఇచ్చినట్లు గుర్తించింది. వాటిలో 24 యూనియన్, అసోసియేషన్ లలో ఫేక్ ఐడీ కార్డులు ఇచ్చి సభ్యత్వం తీసుకున్నారని తేల్చింది. జూనియర్ ఆర్టిస్ట్, మ్యూజిక్ యూనియన్, రైటర్స్ అసోసియేషన్, సినీ ఆర్టిస్ట్ యూనియన్ ల నుండి 2,500 ఫేక్ కార్డులు వచ్చాయని గుర్తించింది. కేటాయింపుల్లో నిజమైన సినీ వర్కర్స్ ని పక్కన పెట్టి.. ఫేక్ కార్డులు ఉన్నవారికే 1 నుండి 6 వరకు ఇచ్చిన ఎలాట్ మెంట్ లో స్థానం కల్పించారని… పైగా ఎన్విరాన్ మెంట్, హెచ్ఎండీఏ పర్మిషన్ లేకుండానే రో హౌస్, డుప్లెక్స్ హౌస్ లు బై లాకి విరుద్ధంగా కట్టారని తేల్చింది. ఇప్పటివరకు అయిన అన్ని ఎలాట్ మెంట్స్ లో ఉన్న ఫేక్ వన్నీ క్యాన్సిల్ చేయాలని రిపోర్ట్ ఇచ్చింది అనిత కమిటీ.
2010 నుంచి 2020 వరకు ఉన్న 16 మంది కమిటీ సభ్యులు… అధిక అడ్వాన్స్ ల రూపంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి జేబులు నింపుకున్నారని నివేదికలో ఉంది. అధిక అడ్వాన్స్ రూపంలో కాంట్రాక్టర్లకు ట్రాన్స్ ఫర్ చేసి తిరిగి నగదు రూపంలో తీసుకున్నారని వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన కమిటీ.. అవన్నీ నిజమని తెలిపింది. 16 మంది సభ్యులైన కొమర వెంకటేష్, వినోద్ బాల, కృష్ణ మోహన్ రెడ్డి, పరుచూరి వేంకటేశ్వరరావు, తమ్మారెడ్డి భరద్వాజ్, కె రాజేశ్వర్ రెడ్డి, దేవినేని బ్రహ్మానందరావు, చంద్ర మధు, కె.ఉదయ్ భాస్కర్, జె.రామయ్య (లేట్ ), కొల్లి రామకృష్ణ, కాదంబరి కిరణ్, అనిల్ కుమార్ వల్లభనేని, ఏ.మహానంద రెడ్డి, ప్రవీణ్ కుమార్ యాదవ్, రఘు బత్తుల నుండి మొత్తం సుమారు రూ.99 కోట్ల వరకు రికవరీ చేయాలని నివేదికలో ఉంది.
చిత్రపురి కాలనీలో అవకతవకలపై గతంలో మీడియాలో వచ్చిన కథనాలన్నింటికీ ఆధారాలు ఉన్నాయని తెలిపింది అనిత కమిటీ. కైరోస్ స్కూల్, షాపింగ్ కాంప్లెక్స్, ఆడిట్ డిఫెక్ట్స్, మినిట్స్ బుక్స్, మెంబర్ షిష్ రిజిస్టర్ సరిగ్గా మెయింటేన్ చేయలేదని చెప్పింది. బై లాకి విరుద్ధంగా ఉన్న చాలా ఆరోపణలను అండర్ సెక్షన్ 50, 60 ద్వారా దర్యాప్తు చేయాలని కోరింది. అయితే ఇప్పటికే కఠిక పేదరికంలో బతుకుతున్న సినీ కార్మికులకు అండగా ఉండాలంటే.. లంచాలు ఇచ్చి అక్రమంగా ఫ్లాట్స్ తీసుకున్న వారు నేరుగా వచ్చి ఒప్పుకోవాలని చిత్రపురి సాధన సమితి డిమాండ్ చేస్తోంది. అవినీతి పరులకు కొమ్ము కాస్తే జైలుకు వెళతారని హెచ్చరిస్తోంది. ఇక చిత్రపురి చిత్ర విచిత్రాలకు సంబంధించిన మరిన్ని కథనాలను వెలుగులోకి తీసుకొస్తోంది తొలివెలుగు.
Advertisements