మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని దుందిబి వాగు నుండి అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుక మాఫియా దర్జాగా అక్రమ రవాణా కొనసాగిస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. మిడ్జిల్ మండల పరిధిలోని దుందుభి వాగు నుండి భారత్ బెంజ్ లతో ఇసుకను జడ్చర్ల, షాద్ నగర్, కల్వకుర్తి తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియా స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతోంది. పోలీస్, రెవిన్యూ, మైనింగ్ శాఖ అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవరించడంపై పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బరితెగించిన ఇసుక మాఫియా.. జడ్చర్ల ఎస్ఐ వెంకటేష్ పై దాడికి దిగింది.
సోమవారం దుందుభి వాగు నుండి ఇసుకను జాతీయ రహదారి 44 నుండి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ వెంకటేష్ ఇసుక వ్యాన్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీస్ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనంపై వెళ్లిన జడ్చర్ల ఎస్ఐ వెంకటేష్ ను ఇసుక మాఫియా.. భారత్ బెంజ్ లారీతో ఢీ కొట్టింది. దీంతో ఎస్ఐ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం స్వల్పంగా ధ్వంసం అయింది. అయితే ఎస్ఐకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇదిలా ఉంటే ఇసుక మాఫియా వాహనాన్ని ఆపాలని ఎస్ఐ అడిగినా ఆపకుండా సినీ ఫక్కీలో దాడి చేసి, తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఎంతో చాకచక్యంగా లారీని వెంబడించి ఎస్ఐ వెంకటేష్ పట్టుకున్నారు. లారీతో పాటు ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
కేసు వద్దంటూ.. తాను ఓ ప్రజాప్రతినిధికి చెందిన వ్యక్తినని, తనని విడిచి పెట్టాలని లేదంటే పరిణామాలు వేరే ఉంటాయని సదరు వ్యక్తి పోలీసులను హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులపై ఓ ప్రజాప్రతినిధిని నుండి ఒత్తిడి తీసుకొచ్చి కేసు నమోదు చేయొద్దని ఇసుక మాఫియా చేసిన ప్రయత్నాలను నేను సైతం స్వచ్ఛంద సంస్థ దృష్టికి రావడం గమనార్హం. దీంతో ఇసుక మాఫియా ఆగడాలను ఎస్ఐపై ఇసుక మాఫియా చేసిన దాడిని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేయడంతో, చేసేది ఏమీ లేక ఇసుక మాఫియా, ఆ ప్రజా ప్రతినిధి సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు జడ్చర్ల దేవుని గుట్ట తండాకు చెందిన కేశవ దేవేందర్ పై కేసు నమోదు చేశారు.
ఇసుక మాఫియాను అరికట్టాలి
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోయాయని, ఇసుక మాఫియాను అరికట్టాలని తాము గత పదకొండు సంవత్సరాలుగా పోరాడుతున్నామని సామాజిక కార్యకర్త, నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. జడ్చర్లలో ఎస్ఐ వెంకటేష్ పై ఇసుక మాఫియా దాడిని ఆయన ఖండిచారు. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు రెవిన్యూ మైనింగ్ శాఖా అధికారులు ఇసుక మాఫియా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపే వరకు తమ పోరాటం కొనసాగుతూ ఉంటుందని, ఇకనైనా ఇసుక మాఫియా తన బరితెగింపులను మాని ఇసుక అక్రమ రవాణాను మానుకోవాలని ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త దిండి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.