– కోమటికుంటలో వాసవి అర్బన్ బరితెగింపు
– అక్రమ షెడ్లు తొలగింపులో అధికారుల అలసత్వం
బాచుపల్లి గ్రామం పరిధిలో కోమటికుంట చెరువు 6.5 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటితో విస్తరించి ఉన్నది. చెరువులో మురికి నీరు కలవడంపై చర్యలు తీసుకోవాలని ఏప్రిల్ 29 న కోమటికుంట చెరువు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి పరిశీలించడంమే కాకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి.. రెండు నెలలు గడుస్తున్నా నామమాత్రపు చర్యలు తీసుకోవడంపై మరొకసారి ఈ కుంటచెరువును బీజేపీ నేతలు పరిశీలించారు.
కోమటికుంట పక్కనే “వాసవి అర్బన్ కన్స్ట్రక్షన్ గ్రూప్” వారు బారీ భవన నిర్మాణ పనుల నిమిత్తం వర్కర్స్ షెడ్లని పదుల సంఖ్యలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో దర్జాగా ఆక్రమించుకుందని ఆరోపించారు బీజేపీ సీనియర్ నాయకులు, నిజాంపేట్ పట్టణ అధ్యక్షులు సతీష్. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అనుమతులు లేకుండా నిర్మించడమే కాకుండా.. చెరువు యొక్క పరిశుభ్రతను నాశనం చేస్తూ, అపరిశుభ్రం డ్రైనేజీ నీటిని కూడా చెరువులోకి వదులుతున్నారని సతీష్ పేర్కొన్నారు.
దీని కారణంగా స్వచ్ఛమైన చెరువు మురికి కుప్పగా మారిందని విరుచుకుపడ్డారు. కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్ మరియూ బఫర్ జోన్లో లేక్ ప్రొటెక్షన్ యాక్ట్- 2010 విరుద్ధంగా ఆక్రమించుకుందని సతీష్ విరుచుకుపడ్డారు. షెడ్ల అక్రమ నిర్మాణాలపై ఏప్రిల్ 30న ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు.. పిర్యాదు చేశామని చెప్తున్నారు. ఈ మేరకు చెరువు సర్వే చేసి సరిహద్దు గుర్తించడమే కాకుండా.. చెరువు రియల్ బఫర్ జోన్ లో మిగతా నిర్మాణాలను తీసుకోవాలని.. సంబంధిత రెవెన్యూ అధికారులకు వాసవి అర్బన్ కన్స్ట్రక్షన్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
వాసవి అర్బన్ కన్స్ట్రక్షన్ కంపెనీ 10 రేకుల షెడ్ లో మాత్రమే తొలగించి మమా అనిపించిందని విమర్శించారు సతీష్. కానీ.. అక్రమాలను తొలగించాల్సిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యక్షంగా ,పరోక్షంగా నిర్మాణ సంస్థకు మున్సిపల్, రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సంబంధిత జోన్లలో సర్వే చేసి.. గుర్తించిన అక్రమ నిర్మాణాలను తొలగించి.. చెరువులో మురికి నీళ్లు వదిలి అపరిశుభ్రంగా తయారుచేసిన వాసవి కన్స్ట్రక్షన్ కంపెనీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజా ప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యం వల్ల చెరువులు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. ఎఫ్టీఐ, బఫర్ జోన్ సరిహద్దులను గుర్తించి.. కోమటికుంట చెరువు పరిధిలోకి వచ్చే ఎలాంటి నిర్మాణాలను అయినా కూల్చివేయాలని డిమాండ్ చేశారు సతీష్.