ఇలియానా… వై.వీ.యస్. చౌదరి దర్శకత్వంలో వచ్చిన రామ్ పోతినేని డెబ్యూ చిత్రం “దేవదాస్”తో తళుక్కున మెరిసి, అందరి కంటిపాపలకి అతుక్కుపోయింది. అందచందాలతో పాటుగ మంచి నటన కనబరచిన ఇలియానాకు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువగా వచ్చిపడ్డాయి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “పోకిరి” సినిమా ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్లో టాప్ హీరోయిన్ అయికూర్చుంది ఇలియానా. నెమ్మదిగా కోలీవుడ్, ఆ పైన ఏకంగా బాలివుడ్‌లో పాగా వేసిందీ గోవా భామ.
బాలీవుడ్‌లో బర్ఫీ, రుస్తుం వంటి చిత్రాల్లో నటించినా ఊహించినంత పేరు, స్టార్‌డమ్ దక్కలేదు. 2012లో వచ్చిన ‘జులాయి’ తర్వాత తెలుగు సినిమాలకు టాటా చెప్పేసిన ఇలియానా.. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన శీను వైట్ల చిత్రం “అమర్ అక్బర్ ఆంటోనీ” తో రీ-ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా పరాజయం పాలైంది. అప్పటి ఇలియానాలా ఇప్పుడూ లేదు అనే నెగెటివ్ పబ్లిసిటీ వల్ల ఆ ఛాన్స్ ఆమె సెకండిన్నింగ్స్‌కు అస్సలు ఉపయోగపడలేదు. ఈ గోవా భామ ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేకపోయినా మరోసారి వార్తల్లో నిలిచింది. తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్, ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో విడిపోయిందన్న వార్త ఇప్పుడు ఇలియాను వార్తల్లో నిలిపింది. చాలా ఏళ్లుగా ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇలియానా, తన సోషియల్ మీడియా మాధ్యమాల్లో తామిద్దరూ జంటగా ఉన్న ఫోటోలను గుప్పిస్తూ, తనని ఏకంగా హబ్బీ అని సంబోధించే దాకా వెళ్ళిపోయింది. ఈ ప్రచారం మరింత శృతి మించి ఓ దశలో ఇలియానా గర్భం దాల్చిందని కూడా వార్తలొచ్చేశాయి. ఇప్పుడు ఈ ప్రేమపావురాలు మాధ్యమాల్లో ఒకరినొకరు అన్ ఫాలో అయిపోవడం, ఇలియానా తను ఆండ్రూతో కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చెయ్యడంతో అందరూ ఏదో జరిగిందని అనుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఏవో పొరపచ్చాలు రావడంతో బ్రేకప్ చెప్పేసుకున్నారన్న వార్త షికారు చేస్తోంది. ఇలియానా అయితే ఇంతవరకు దీనిపై ఏం మాట్లాడటం లేదు.!