ప్రపంచంలోనే అత్యాధునిక పోలీసు కమాండ్ కంట్రోల్ టవర్స్ నిర్మించబోతున్నట్లు గొప్పలు చెప్పుకున్న సీఎం కేసీఆర్, ప్రభుత్వం ఎందుకు ఆలస్యం అవుతుందో మాత్రం చెప్పటం లేదు. తాజాగా కేటీఆర్ కూడా 2022 వరకు పూర్తిచేస్తామంటూ చెప్పటం ఇప్పుడు అనేక ఊహాగానలకు తావిస్తోంది.
నిజానికి 20 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామంటూ నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ ఘనంగా ప్రకటించింది. రెండు భారీ టవర్లు, 15 అంతస్థులతో ఉండేలా ఈ టవర్స్ నిర్మాణం చేపట్టారు. మొదట 302 కోట్ల అంచనాతో మొదలైన ఈ ప్రాజెక్టు 350కోట్లకు అంచనాలను మార్చారు. దాదాపు 6లక్షల చదరపు అడుగులతో నిర్మితమవుతోన్న ఈ నిర్మాణాలు ఇప్పుడు 450 కోట్లకు చేరింది. ఇలా రోజులు గడిచిన కొద్ది అంచనాలు రెట్టింపు అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ సంస్థ అడిగినంత ఇస్తూనే పోతుంది.
కానీ ఇదే సంస్థ ప్రగతి భవన్‌ను మాత్రం అనుకున్న సమయానికన్నా ముందే పూర్తి చేసింది. నిర్మాణం ఆలస్యం చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సింది పోయి అంచనాలు రెట్టింపు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేయటమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.