చైనా దురాక్రమణలు ఆగడం లేదు. తాజాగా భారత సరిహద్దుల్లో మరో గ్రామాన్ని చైనా నిర్మించింది. భూటాన్ వైపు ఉండే డోక్లామ్ పీఠభూమికి సమీపంలో ఈ గ్రామాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. డోక్లామ్ పీఠభూమికి తూర్పున 9 కిలోమీటర్ల దూరంలో అమూచు నది లోయలో కొత్త గ్రామాన్ని నిర్మించింది.
ఇలా కృత్రిమంగా నిర్మించిన గ్రామాలను చైనా ‘పంగ్డా’అని పిలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ ను ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో చైనా దురక్రమణకు పాల్పడిన అంశం బట్టబయలైందంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి.
ఈ చిత్రాలను స్పేస్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మక్సార్’ విడుదల చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది. భూటాన్ సరిహద్దుల్లోని భూమిని ఆక్రమించి గ్రామాన్ని చైనా నిర్మించిందని, గ్రామంలో ప్రతి ఇంటి ఎదుట కార్లు పార్క్ చేసి ఉన్నట్టు ఫోటోలను బట్టి స్పష్టమవుతోంది.
డోక్లామ్ లో అక్రమంగా గ్రామాన్ని చైనా నిర్మించడం ఇదేమి తొలిసారి కాదు. అంతకు ముందు 2017లో ఓ గ్రామాన్ని చైనా నిర్మించింది. అయితే ఇలా చైనా అక్రమ నిర్మాణానికి తెగపడటంపై భారత్ స్పందించింది. ఈ మేరకు భూటాన్ కు భారత్ మద్దతుగా నిలిచింది.
ఈ క్రమంలో 2017లో దాదాపు 73 రోజుల పాటు ఇరు దేశాల సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగింది. దురాక్రమణవాదంపై చైనాపై పలు దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా చైనా డోక్లామ్ కు దక్షిణ ప్రాంతంలో మరో గ్రామాన్ని నిర్మించేందుకు రెడీ అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.