భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజు రోజుకూ నిప్పులు చెరుగుతున్నాడు. ప్రతి రోజూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టే పరిస్థితులు లేవు.
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో భారత వాతావారణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వీటిలో ఒడిశా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాలు ఉన్నాయి.
ఢిల్లీలో బుధవారం అత్యధికంగా 44.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగత్ర నమోదైంది. దీంతో పాటు రాజస్థాన్ లోని బార్మర్, బికనీర్, పాలోడీ ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూపీలోని ఝాన్సీ, హర్యానాలోని నార్నాల్ లాంటి ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అయితే మే మొదటి వారం తర్వాత మాత్రమే రోజువారి గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే జెనామణి తెలిపారు.
మే 1 వరకు వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నందున ఢిల్లీ, వాయువ్య భారతదేశంలోని మైదానాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించారు.
ఫిబ్రవరి 25 నుండి చెప్పుకోదగినంతగా వర్షపాతం లేదని చెప్పారు. అలాగే, ఏప్రిల్ 14 – 21 మధ్య, రాజస్థాన్, హర్యానాలలో దుమ్ము తుఫానులు కనిపించాయన్నారు.
మే 2న పశ్చిమ కల్లోలాలు వాయువ్య, మధ్య భారతదేశానికి కొంత ఉపశమనం కలిగిస్తాయని వివరించారు. రాబోయే నాలుగు రోజుల్లో వాయువ్య, మధ్య భారతదేశంలో వడగాలులు వీస్తాయని పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల్లో తూర్పు భారత్ లో వేడిగాలులను అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు.