తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని.. ఇది ఒడిశా తీరానికి సమీపంలో కొనసాగుతోందని వివరించింది. దీని ఫలితంగా పలు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయని అంచనా వేసింది.
రానున్న ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా, ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గోదావరి పరివాహక ప్రాంతాలకు మళ్లీ వరద ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, యానాం ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
తెలంగాణలో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోసారి రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు అరెంజ్ అలర్ట్ ప్రకటించింది.