దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ రోజు నుంచి జనవరి 14వ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
రానున్న నాలుగైదు రోజుల్లో అరేబియా, బంగాళాఖాతంల నుంచి గాలులు వీస్తాయని.. ఈ ప్రభావంతో వర్షం కురుస్తుందని ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు. విదర్భ, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశాలలో జనవరి 14 వరకు చాలా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇవాళ, రేపు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్‌లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 11, 13 తేదీల్లో ఒడిశాలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. జనవరి 13న విదర్భలో ఉరుములు, మెరుపులు,వడగళ్లతో వర్షం కురవొచ్చని అంచనా వేశారు. జనవరి 11న చత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, గంగానది పశ్చిమ బెంగాల్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో వర్షాలు కురుస్తాయని అన్నారు.
Advertisements
జనవరి 12, 13 తేదీల్లో అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. రాబోయే 4-5 రోజులలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తుయని చెప్పారు. కోస్తాంధ్ర, తెలంగాణాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.