జాతీయ స్థాయిలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నీట్ పరీక్షను నిర్వహిస్తుంటారు. ఈనెల 12న ఈ ఏడాది పరీక్షను నిర్వహించారు. అయితే నీట్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఈమధ్యే తీర్మానం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశంలోని ప్రధాన సమస్యల్లో నీట్ కూడా ముఖ్యమైందని.. దీన్ని రద్దు చేయాలని అంటోంది స్టాలిన్ ప్రభుత్వం. ఇలాంటి తరుణంలో నీట్ పరీక్షలో భారీ స్కాం వెలుగు చూసింది. మహారాష్ట్ర నాగ్ పూర్ కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ పెద్ద ప్లానే వేసి దొరికిపోయింది.
విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పిస్తాం.. నకిలీ వ్యక్తులతో పరీక్ష రాయిస్తామంటూ ఐదు సెంటర్ల పరిధిలో ఒప్పందాలు చేసుకుంది సదరు కోచింగ్ సెంటర్. అయితే ఈ విషయం పరీక్ష జరగడానికి ముందే లీక్ అయింది. సీబీఐ ఎంట్రీ ఇచ్చి పక్కాగా తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే కోచింగ్ సెంటర్ డైరెక్టర్, కొంతమంది విద్యార్థులపై కేసు నమోదు చేసింది. అడ్మిషన్ కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు అధికారులు.
విద్యార్థుల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లతో ఫొటోలు మార్ఫింగ్ చేసినట్లు తెలిసింది. అభ్యర్థుల ఈ-ఆధార్ కార్డులను తీసుకుని వాటితో నకిలీ ఐడీ కార్డులు రూపొందించారు. ఒకవేళ ఈ ప్లాన్ వర్కవుట్ కాకపోతే.. ఆన్సర్ కీ పేపర్లు ఇస్తాం.. ఓఎంఆర్ షీట్ ను మారుస్తామంటూ విద్యార్థులతో అగ్రిమెంట్ చేసుకుంది కోచింగ్ సెంటర్. ఈ బండారం మొత్తం ముందుగానే బయటకు పొక్కడంతో సీబీఐ తగిన చర్యలు తీసుకుంది.