ఢిల్లీ కోర్టు ఆదేశించినట్టుగా నిర్భయ దోషులకు ఈ నెల 22న ఉరి శిక్ష అమలు కాకపోవచ్చు. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ తన మరణ శిక్షపై రాష్ట్రపతి కి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. రాష్ట్రపతి అతని క్షమాభిక్ష తిరస్కరించినప్పటికీ శిక్ష అమలుకు 14 రోజుల ముందు దోషికి నోటీసులివ్వాలి. దీంతో కోర్టు ఆదేశించినట్టుగా ఈ నెల 22న ఉరి తీయడం కుదరదు. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు తెలియజేసింది. తనపై జారీ చేసిన డెత్ వారెంట్ ముందస్తుగా తీసుకున్న నిర్ణయమంటూ ముఖేష్ సింగ్ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్షలో పేర్కొనట్టు ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టు జడ్జీలు జస్టిస్ మన్మోహన్, సంగీత దింగ్రాలకు తెలియజేసింది.
ఢిల్లీ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ను అమలు చేయడానికి రాష్ట్రపతి నిర్ణయం వచ్చేంత వరకు వేచి ఉండాలి. న్యాయ ప్రక్రియను మరింత ఆలస్యం చేయడం కోసం దోషలు మూకుమ్మడిగా కాకుండా వేర్వేరుగా రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ముందుగా ముఖేష్ క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకున్నట్టు తెలిసింది.
నిర్భయపై గ్యాంగ్ రేప్, హత్య కేసులో ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ అనే నలుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. వీరి ఉరిశిక్షను వెంటనే అమలు చేయాలని ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారించిన కోర్టు ఈ నెల 22, ఉదయం 7 గంటలకు దోషులను ఉరితీయాలని తీర్పు నిచ్చింది. డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వినయ్ శర్మ అనే దోషి సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. ఇప్పుడు తాజాగా ముఖేష్ సింగ్ రాష్ట్రపతి క్షమా బిక్షకు పెట్టుకున్నాడు.