తెలంగాణ కాంగ్రెస్‌లో అతి త్వరలో కొత్త నాయకత్వం కొలువుదీరబోతోంది. పీసీసీ చీఫ్ ఎవరనే దానిపై ఇప్పటికే అనధికారంగా అధిష్టానం క్లారిటీ ఇచ్చింది.అయితే కొత్త కార్యవర్గంలొ ఈసారి మహిళలకు అధిష్టానం మంచి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి కొండా సురేఖకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.
డీకే అరుణ, విజయశాంతి, సబితా ఇంద్రారెడ్డి వంటి నేతలు పార్టీని వీడి వెళ్లడంతో.. కాంగ్రెస్‌లో మహిళా నాయకత్వం కొంత వీక్ అయింది. దీంతో ఆ గ్యాప్‌ను పూడ్చాలని ఢిల్లీ పెద్దలు అనుకుంటున్నారు. అందుకే వారి స్థానాన్ని భర్తీ చేసేలా పలువురు మహిళా నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తోందట. కాగా కొండా సురేఖతో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్కకు కీలకమైన పదవి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్‌లో చేరాక.. సీతక్క గ్రాఫ్ మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో కొండలు, వాగులు దాటి చేసిన సాయం ఎందరినో కదిలించింది. ఆమె చేసిన సేవలు జాతీయ నాయకత్వం దృష్టికి కూడా వెళ్లాయి. దీంతో ఆమెకు మహిళా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే చాన్స్ ఉందని అంటున్నారు. వాగ్ధాటి, పోరాట పటిమ ఉన్న సీతక్కకు ఆ పదవి ఇస్తే కచ్చితంగా న్యాయం చేస్తారని వారు భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు రేవంత్ రెడ్డితో ఆమెకు మంచి సంబంధాలు ఉండటం.. పార్టీకి ఎంతో కలిసి వస్తాయని అధిష్టానం భావిస్తోందని టాక్.