రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ మరియు క్రెడిట్ కార్డులకు సంబంధించి తాజా నిబంధనలను విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు జూలై 1, 2022 నుండి బ్యాంకులు అలాగే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ప్రస్తుత నిబంధనలలో మార్పులు చేస్తూ నూతన నిబంధనలు వర్తిస్తాయి. కొత్త మార్గదర్శకాలను పాటించని బ్యాంకులపై జరిమానాలు విధించడానికి కూడా సిద్దమయ్యారు.
ఏదైనా బ్యాంకు కస్టమర్ల డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను వారి అనుమతి లేకుండా జారీ చేసినట్లయితే లేదా అప్‌గ్రేడ్ చేసినట్లయితే రిజర్వ్ బ్యాంకు జరిమానాలు విధిస్తుంది. నిబంధనలలో భాగంగా, బ్యాంకుల నికర విలువ రూ. 100 కోట్లు ఉంటేనే క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని చేపట్టేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. బ్యాంకులు తమంతట తాముగా లేదా ఇతర కార్డ్ లు జారీ చేసే బ్యాంకుల భాగస్వామ్యంతో వ్యాపారం చేసుకోవచ్చు.
రూ. 1000 కోట్ల నికర విలువ కలిగిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తమ స్పాన్సర్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకుల సహకారంతో క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి అనుమతి ఉంటుంది. ఇక కొత్త నిబంధనల ప్రకారం చూస్తే… క్రెడిట్ కార్డ్ జారీ చేసిన తేదీ నుండి 30 రోజులలోపు యాక్టివేట్ కానట్లయితే, దాన్ని యాక్టివేట్ చేయడానికి వినియోగదారుకు వన్-టైమ్ పాస్‌వర్డ్ అవసరం. కార్డ్ యాక్టివేషన్‌కు ముందు, కార్డ్ హోల్డర్‌లకు సంబంధించిన క్రెడిట్ సమాచారాన్ని Cibil, CRIF, Experian మొదలైన ఏ క్రెడిట్ బ్యూరోలకు చెప్పడానికి వీల్లేదు.
క్రెడిట్ కార్డ్ లావాదేవీలను సమానమైన నెలవారీ వాయిదాలుగా మార్చే ముందు అసలు మొత్తం, వడ్డీ, తగ్గింపు మరియు ఛార్జీలు ఏవైనా ఉంటే స్పష్టంగా చెప్పాలి. కార్డ్ హోల్డర్‌కు 30 రోజుల నోటీసుతో ఒక సంవత్సరం పాటు ఉపయోగించకపోతే క్రెడిట్ కార్డ్ ను క్లోజ్ చెయ్యాలి. క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన ఛార్జీలలో ఏవైనా మార్పులు వాటి అమలుకు 30 రోజుల ముందు కస్టమర్‌కు చెప్పాలి.