మహారాష్ట్రలో జరుగుతున్న వ్యవసాయ ప్రదర్శనలో పాల్గొన్న కర్ణాటక చెందిన ఓ పోతు రాజు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.తన దేహ ధారుడ్యంతో అక్కడి రైతులను కట్టిపడేసింది.దాని ఆహార్యంతోబాటు అది తినే ఆహారము, బరువు లాంటి పలు అంశాలు నిర్వాహకులనే కాక, సందర్శకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంతకీ ఆదున్న ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
ఆ దున్నపోతు పేరు గజేంద్ర. 1500 కిలోలు బరువున్న ఈ దున్నపోతు..రోజుకు 15 లీటర్ల పాలు తాగుతుంది. కర్ణాటక బెళగావికి చెందిన రెడ్యాచే మాలక్ అనే వ్యక్తి…ఈ గజేంద్రకు యజమాని. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనకు దీన్ని తీసుకొచ్చాడు రెడ్యాచే.
గజేంద్రను చూసేందుకు రైతులు ఎగబడుతున్నారు. దీని ధర దాదాపు 1.5 కోట్లు వరకు ఉంటుందని దాని యజమాని రెడ్యాచే చెబుతున్నాడు. దీనికి అయ్యే ఖర్చేకాదు దీన్నుంచి వచ్చే ఆదాయం కూడా భారీగానే ఉంటుందంటున్నాడు గంజేంద్రుడి యజమాని.
“ఈ దున్నపోతును పంజాబ్కు చెందిన కొందరు రైతులు రూ.1.5 కోట్లకు కొనేందుకు అడుగుతున్నారు. ఇది రోజు 15 లీటర్ల పాలతో పాటు.. రెండు కిలోల పిండి, 3 కిలోల గడ్డి తింటుంది. దీని నుంచి మాకు రోజుకు రెండు వేల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ తరహా దున్నపోతులు మా దగ్గర ఐదు ఉన్నాయి.
వీటి నుంచి మొత్తం రూ.10 వేలు వస్తాయి. మరో 50 గేదేలు ఉన్నాయి. ఇవి 100 నుంచి 150 లీటర్ల పాలు ఇస్తాయి. వీటి నుంచి రోజుకు రూ. 50వేలు వస్తాయి.” అంటూ చెప్పుకొచ్చాడు రెడ్యాచే. అంతేకాదు కోట్లిచ్చినా తమ దున్నపోతులను విక్రయించేది లేదని రెడ్యాచే చెబుతున్నాడు. వాటిని తమ కుటుంబంలో ఒకటిగా చూసుకుంటున్నట్లు తెలిపాడు.
ఈ వ్యవసాయ ప్రదర్శన శాలను గత 15 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు. మహేశ్ బెంద్రే అనే వ్యక్తి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. తన తండ్రి గణేశ్ బెంద్రే జ్ఞాపకార్థం ఈ ప్రదర్శన శాలను నిర్వహిస్తున్నట్లు నిర్వహకుడు తెలిపాడు. ఇక్కడ రైతులకు ఉపయోగపడే వివిధ రకాల ఆధునిక వ్యవసాయ పరికరాలను ప్రదర్శనలో ఉంచినట్లు వెల్లడించాడు.
మహారాష్ట్ర రైతులకు సాంకేతికతను అందించే లక్ష్యంతో ఈ ప్రదర్శన శాలను ఏర్పాటు చేశాం. కిసాన్ కృషి ప్రతిస్థాన్ అనే సంస్థ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా ఈ ప్రదర్శన శాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ 180 స్టాల్స్ ను అందుబాటులో ఉంచాం. మధ్యప్రదేశ్, హరియాణా, పంజాబ్ ఇతర రాష్ట్రాల నుంచి రైతులు ఈ ప్రదర్శనకు వస్తున్నారని ప్రదర్శన శాల నిర్వహకుడు మహేశ్ బెంద్రే వెల్లడించారు.