పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యూటర్న్ తీసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని గతంలో ఆయన ప్రకటించారు. తాజాగా గత నిర్ణయానికి భిన్నంగా ఆయన రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనకు ఆయన వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక ప్రజల మద్దతు కోరుతూ ఆయన ఆదివారం ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ ర్యాలీలో ఈ విషయాన్ని వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.
అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ లో శనివారం చర్చ జరుగుతుందని అంతా భావించారు. కానీ ఇటీవల మృతి చెందిన ఎంపీలకు సంతాపం పాటించి సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు.
దీంతో అవిశ్వాసంపై సోమవారం చర్చకు రానున్నట్టు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే 50 మంది మంత్రులు అజ్ఞాతంలో ఉన్నారని, మిత్ర పక్షాలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చేందుకు విముఖత చూపుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి క్రమంలో సోమవారం జరిగే అవిశ్వాస పరీక్షలో ఓడిపోతే అందరి ముందు నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాజీనామా చేసి హూందాగా ముందస్తుకు వెళ్లాలని ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం.