పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కోర్టులో చుక్కెదురైంది. ఓ కేసులో తాను కోర్టుకు హాజరు కాకుండా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ని యాంటీ టెర్రరిజం కోర్టు కొట్టివేసింది. లోగడ ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఇమ్రాన్ ఖాన్, ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. దానిపై ఈసీ వర్గాలు కోర్టులో ఇమ్రాన్ పైన, ఆయన ఆధ్వర్యం లోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ కు చెందిన కార్యకర్తలపైన కేసు పెట్టాయి.
అయితే ఈ కేసులో తాను కోర్టుకు హాజరు కాకుండా తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇమ్రాన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఆస్తులకు సంబంధించి ఇమ్రాన్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, అందువల్ల నేషనల్ అసెంబ్లీ సభ్యత్వానికి ఆయన అనర్హుడని ఈసీ నాడు పేర్కొంది. యాంటీ టెర్రరిజం చట్టం కింద ఇస్లామాబాద్ లోని సగియానీ పోలీసు స్టేషన్ లో ఆయనపై కేసు నమోదయింది.
ఈ కేసులో బుధవారం కోర్టులో ఇమ్రాన్ తరఫున వాదించిన లాయర్.. ఇందులో ఉగ్రవాద సంబంధ సెక్షన్లను తప్పుడుగా చేర్చారని ఆరోపించారు. కానీ ఈ వాదనతో జడ్జి జవాద్ అబ్బాస్ ఏకీభవించలేదు. పలుకుబడిగల ఓ వ్యక్తిని, ఓ సామాన్యుడిని కూడా తాము ఒకేరకంగా చూస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ బెయిల్ ని వెనక్కి తీసుకోవాలని, లాహోర్ హైకోర్టు నుంచి ప్రొటెక్టివ్ బెయిల్ కి అవకాశం ఉందని ఆయన అన్నారు. ఏమైనా .. ప్రస్తుత పిటిషన్ ను తిరస్కరిస్తునట్టు కోర్టు ప్రకటించింది.