పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత సంస్థ(ఎస్టాబ్లిష్‌మెంట్) తనకు మూడు ఆప్షన్లు ఇచ్చిందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అవి రాజీనామా, అవిశ్వాసం లేదా ఎన్నికలు అని ఆయన తెలిపారు.
కానీ ఇక్కడ ఎస్టాబ్లిష్‌మెంట్ అంటే ఏంటో ఆయన స్పష్టంగా వివరించకపోవడం గమనార్హం. 75 ఏండ్ల చరిత్రలో సగం కాలం పాటు దేశాన్ని పాలించిన శక్తివంతమైన పాక్ సైన్యం భద్రతా, విదేశాంగ విధాన విషయాల్లో ఇంతవరకు గణనీయమైన అధికారాన్ని కలిగి ఉన్నట్టు తెలిపారు.
ప్రతిపక్షం, ప్రభుత్వం లేదా మరో పార్టీ ముందస్తు ఎన్నికలు, రాజీనామాను ఆప్షన్స్ గా మీ ముందు ఉంచాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తన ముందు మూడు ఆప్షన్లు ఉన్నట్టు తెలిపారు.
ప్రస్తుతం ఎన్నికలు తన ఉత్తమ ఎంపిక అని ఆయన అన్నారు. రాజీనామా గురించి ప్రస్తుతం తాను ఆలోచించడం లేదన్నారు. అవిశ్వాసానికి సంబంధించినంతవరకు తాను చివరి వరకు పోరాడుతానని తెలిపారు.
అవిశ్వాస తీర్మానానికి ముందు ఆదివారం తమ పార్టీకి చెందిన పలువురు సభ్యులు ప్రతిపక్షంలో చేరిపోయారని ఖాన్ అన్నారు. అవిశ్వాస తీర్మానం విఫలమైనప్పటికీ తాము అలాంటి(పిరాయింపుదారుల) వ్యక్తులతో ప్రభుత్వాన్ని నడపలేమన్నారు. అందువల్ల ఇప్పుడు ఎన్నికలకు వెళ్లడం పాకిస్తాన్‌కు మేలు చేస్తుందన్నారు.