ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ వైపు ప్రకటించగా.. మరో వైపు ఉక్రెయిన్ దళాలు విజృంభిస్తూ రష్యన్ బలగాలను దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఖేర్సన్ ప్రాంతంలో 2,400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఇవి తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఖేర్సన్ తో బాటు ఖార్కివ్, లీమన్, మరి కొన్ని ప్రాంతాలపై తమ పట్టు బిగిస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్ లోని డోనెస్క్ ని స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రకటించినప్పటికీ ఉక్రెయిన్ సేనలు ముందుకు దూసుకువెళ్తూనే ఉన్నాయి.
తాము వశం చేసుకున్నట్టు చెబుతున్న జపోర్జజియా ప్రాంతంపై రష్యా మొదటిసారిగా పేలుడుపదార్థాలతో నింపిన ‘కమికాజే’ డ్రోన్లను వినియోగిస్తోంది. ఈ సిటీలోని ఓ భవనంపై వీటి దాడుల కారణంగా మరణించినవారి సంఖ్య 11 కి పెరిగినట్టు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. శుక్రవారం పుతిన్ 70 వ జన్మదినమైనప్పటికీ.. .. తాజా యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆయన నిరాడంబరంగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. క్రెమ్లిన్ లో ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేవు. ఉక్రెయిన్ మీద దాడి తరువాత ఆయన అతి పెద్ద సవాలునెదుర్కొంటున్నారు.
నిజానికి జఫోర్జజియా లో అతి పెద్ద అణు విద్యుత్ ప్లాంట్ ఉంది. ఇది రష్యా అధీనంలో ఉందని చెబుతున్నప్పటికీ.. ఇప్పటికీ దీనిపై ఉక్రేనియన్ దళాల పట్టు ఉందని ‘గార్డియన్’ పత్రిక వెల్లడించింది. ఇక మిసైల్స్ తో పోలిస్తే కమికాజే డ్రోన్లు తక్కువ సామర్థ్యం కలిగినా.. ఇవి కలుగజేసే నష్టం మాత్రం ఎక్కువేనని, అందువల్లే వీటిని రష్యా జపోర్జజియా పై మోహరించిందని ఈ పత్రిక పేర్కొంది.
ఉక్రెయిన్ లో రష్యా ఘోరంగా ఓటమినెదుర్కొంటోందని రష్యా అనుకూల వాదులు, మిలిటరీ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టాలకు రష్యన్ సైనికుల పొరబాట్లే కారణమని వారు విశ్లేషిస్తున్నారు. ఖేర్సన్ ప్రాంతంలో రష్యా అధీనంలో ఉన్న భాగంలోని ఓ బ్రిడ్జిపై ఉక్రేనియన్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ పేలుడులో ఓ బస్సు పూర్తిగా నాశనమై అయిదుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. రష్యన్ టాస్ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది.