అది ముంబై రైల్వేస్టేషన్…రోజుకు కొన్నివేల మంది ప్రయాణికులని తమ తమ ఉద్యోగాలకు, మళ్ళీ వారి వారి గమ్యస్థానాలు చేరవేస్తుంది. రైలు కూతలు, చెవులు మారుమోగించే రైల్వే అనౌన్సర్ల షెడ్యూల్ దండకం, ప్రయాణీకుల హడావుడి, అరుస్తూ అమ్మే చిరు వ్యాపారుల సందడిల మధ్య రొటీన్ గా రన్ అవుతున్న ముంబై రైల్వేస్టేషన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి చీఫ్ లోకో ఇన్‌స్పెక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏ రైల్వేస్టేషన్ పరిధిలో ఉద్యోగం చేస్తున్నాడో, ఏ రైల్వే సంస్థ ఇచ్చే జీతంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడో అదే రైలుకి తన ప్రాణాలర్పించాడు.
రైల్వే ప్లాట్‌ఫాంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియోలో అధికారి ప్లాట్‌ఫాంపై లోకల్ ట్రైన్ కోసం వేచిచూస్తూ నిలబడటం కనిపించింది. ట్రైన్ స్టేషన్‌లోకి వస్తుండగా ప్రయాణీకులు చూస్తుండగానే ఒక్క ఉదుటున ప్లాట్‌ఫాంపై నుంచి కిందకు దూకిన అధికారి ట్రాక్స్‌పై పడుకుండటం కనిపించింది.
అతడి శరీరంపై నుంచి రైలు దూసుకెళ్లడంతో క్షణాల్లో విగతజీవిగా మారాడు. పనిలో ఒత్తిళ్ల కారణంగా ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్యకు పాల్పడలేదని పశ్చిమ రైల్వేల పీఆర్ఓ పేర్కొన్నారు. విల్లేపార్లే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.