తండ్రి ఫొటోతో పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చింది పెళ్లి కూతురు. ఇది చూసిన జనాలు ఆవేదనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రతీ అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తన పక్కనే ఉండాలనుకుంటుంది. అందులోనూ తల్లిదండ్రులు పక్కనే ఉంటే ఆ ధైర్యమే వేరు.
ప్రియాంక భాటియా అనే అమ్మాయి తొమ్మిదేండ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయింది. క్యాన్సర్ కారణంగా తన తండ్రి మరణించాడు. అయితే పెళ్లి రోజున తండ్రి ఫొటోతో ప్రియాంక తన తాతతో కలిసి మండపం పైకి వచ్చింది. తన తండ్రి మరణానంతరం తాత అన్నీ తానై తనను చూసుకున్నారని చెబుతూ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది ప్రియాంక.
ఆమె స్టోరీని హ్యూమన్స్ ఆఫ్ బాంబే తమ సోషల్ మీడియా వేదికలపై షేర్ చేసింది. తాను 9 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని, ఆ కొన్నేళ్లల్లోనే తండ్రి తనను ఎంతో ప్రేమగా చూసుకున్నాడని, తనకు మామిడి పండ్లు ఇష్టం కావడంతో ప్రతి సమ్మర్ లోనూ క్రమం తప్పకుండా పెద్ద బాక్స్‌లో వాటిని ఇంటికి తీసుకువచ్చేవాడని ప్రియాంక గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.