జమ్ము కశ్మీర్‌లో ముష్కరులు మరోసారి రెచ్చి పోయారు. తాజాగా పుల్వామాలో సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు హతమార్చారు. సంజయ్ శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సంజయ్ శర్మను ఆస్పత్రికి తరలించగా మరణించారని చెప్పారు.
అచన్ ప్రాంతంలో స్థానిక మార్కెట్‌కు సమీపంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగినట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో భద్రతా దళాలను మోహరించామని, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
గతేడాది అక్టోబరు 15న షోపియాన్ జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
పురన్ కృష్ణన్ భట్ అనే కశ్మీరీ పండిట్ పై అతని ఇంటి సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో కృష్ణన్ భట్ కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. ఈ దాడి తమ పనేనని కశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్ అనే సంస్థ ప్రకటించింది.
కశ్మీరీ పండిట్ హత్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో న్యాయం జరగకపోతే టార్గెట్ హత్యలు ఆగవని పేర్కొన్నారు. కశ్మీరీ పండిట్ కృష్ణన్ భట్ హత్యకు ఆర్టికల్ 370 తొలగింపే ఓ కారణమని పేర్కొన్నారు.