త్రిపురలో హింసాత్మక ఘటనలపై విచారణకు వెళ్లిన పార్లమెంటరీ బృందంపై దాడి జరిగింది. పార్లమెంటరీ బృందంలోని సభ్యులను కొందరు అడ్డుకున్నారు. సెపాహిజాలా జిల్లాలో బిషాల్‌ఘర్‌కు పార్లమెంటరీ బృందం వెళ్లగా నేపాల్ చంద్ర నగర్ వద్ద కొందరు వ్యక్తులు ఆ బృందానికి అడ్డు తగిలారు. బృందం సభ్యులు ప్రయాణిస్తున్న వాహనాలపై రాళ్లు విసిరారు. అది బీజేపీ కార్యకర్తల పనే అని కాంగ్రెస్, వామపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ ఎకల అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో దీనిపై విచారణకు పార్లమెంట్ సభ్యుల బృందం ఒకటి త్రిపురకు చేరుకుంది. రెండు రోజుల పాటు బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. బృందంలో నలుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు వున్నారు.
విచారణ నిమిత్తం వచ్చి బృందం మూడు గ్రూపులుగా విడిపోయింది. విచారణ బృందం వెంట స్థానిక కాంగ్రెస్, సీపీఎం ఎమ్మెల్యేలు పీఆర్ నటరాజన్, రంజితా రంజన్, ఏఏ రహీమ్, అబ్దుల్ ఖలిక్, బికాష్ రంజన్ భట్టాచార్య, వినయ్ విశ్వం, ఇలారామ్ కరీమ్ సహాయంగా వెళ్లారు.
వారంతా కలిసి పశ్చిమ త్రిపురలోని సెపాహిజాల, గోమతి జిల్లాల్లో దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ బాధితులతో కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అక్కడ సెపాహిజాలా జిల్లాలోని బిషాల్‌ఘర్‌కు వెళ్లిన బృందంపై వారు దాడి చేశారు.
గ్రూపు సభ్యులు ప్రయాణించిన వాహనాలపై వాళ్లు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో గ్రూపు సభ్యుల వెంట వచ్చిన ఎస్కార్ట్ పోలీసులు సహాయం చేయడంతో వారు ఆ ప్రాంతం నుంచి అతి కష్టం మీద రాగలిగారు. మరోవైపు దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.